Exam Paper Tampering: హెల్త్ వర్శిటీ ఘటనపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:26 AM
పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ డాక్టర్‌ను పాస్ చేయించిన ఘటనపై సర్కారు సీరియ్‌సగా ఉంది....
ఉన్నఫళంగా హైదరాబాద్ రావాలని వీసీకి పిలుపు
సీఎ్‌సకు వివరణ ఇచ్చుకున్న వీసీ.. ఇప్పటికే సర్కారుకు నివేదిక
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ డాక్టర్‌ను పాస్ చేయించిన ఘటనపై సర్కారు సీరియ్‌సగా ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే ముగ్గురు సభ్యుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ తన నివేదికలో ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. ‘ఇంటూ’ మార్క్ కొట్టిన పేపర్లను తిరిగి ఉన్నతాధికారులే స్వయంగా దిద్దించినట్లు నివేదికలో పొందుపరిచింది. ఆ నివేదికను ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్ధుకు అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డిని తక్షణమే సచివాలయానికి రావాలని ఆరోగ్య కార్యదర్శి ఆదేశించారు. వరంగల్‌లో ఉన్న ఆయన ఆగమేఘాలపై హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. సాయంత్రం సచివాలయంలో ఆరోగ్య కార్యదర్శిని కలిశారు. అనంతరం ఆమె వీసీని వెంటబెట్టుకుని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వద్దకు తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై వీసీని సీఎస్ ఆరా తీసినట్లు సమాచారం. అలాగే తొలుత ఫెయిల్ అయి.. అనంతరం పాస్ అయిన వైద్యురాలి జవాబు పత్రం విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నారని సీఎస్ వీసీని ప్రశ్నించినట్లు సమాచారం. పరీక్షల్లో ఫెయిలైతే మరోమారు హాజరు అవుతారని, ఇలా చేయడమేంటని గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఎస్ ప్రశ్నలకు వీసీ వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. సదరు వైద్యురాలు విశ్వవిద్యాలయానికివచ్చి తాను పరీక్ష ఫెయిల్ అయ్యే అవకాశం లేదని, అన్ని జవాబులు రాశానని తనకు తెలిపిందని, తన జవాబు పత్రాలను పరిశీలించాలని కోరిందని వీసీ సీఎ్‌సకు చెప్పినట్లు తెలుస్తోంది. పేపర్ 1, పేపర్ 3కి సంబంధించి 8, 9, 10 జవాబులు దిద్దకుండా వాటిపై ‘ఇంటూ’ మార్క్ పెట్టినట్లు గుర్తించామని, ఎవాల్యుయేటర్ల సమక్షంలో పేపర్లను తిరిగి దిద్దించి, ఆమెకు న్యాయం చేశామని వివరణ ఇచ్చారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.