Share News

Government Seeks Governor Permission: కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వండి!

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:56 AM

ఫార్ములా ఈ-కారు రేసు కేసు ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌ చర్యలు చేపట్టడానికి అనుమతి...

Government Seeks Governor Permission: కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వండి!

  • ఫార్ములా ఈ-రేసు కేసులో గవర్నర్‌కు ప్రభుత్వ విజ్ఞప్తి

  • కేసు ఫైలును గవర్నర్‌కు పంపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

  • న్యాయనిపుణుల అభిప్రాయం కోరిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలప్రాసిక్యూషన్‌కు విజిలెన్స్‌ కమిషనర్‌ సిఫారసు

  • పీసీ యాక్ట్‌ ప్రకారం చర్యలకు కేంద్రానికి ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కారు రేసు కేసు ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను ప్రభుత్వం కోరింది. దీనిపై గవర్నర్‌ న్యాయనిపుణుల అభిప్రాయం కోరినట్లు తెలిసింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. తమ దర్యాప్తు పూర్తయిందని, కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆ లేఖను, ఏసీబీ రిపోర్టును విజిలెన్స్‌ కమిషనర్‌కు పంపించింది. ఏసీబీ రిపోర్టును పరిశీలించిన విజిలెన్స్‌ కమిషనర్‌.. నిందితులపై ప్రాసిక్యూషన్‌ చర్యలు చేపట్టవచ్చంటూ క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌ చర్యలకు గవర్నర్‌ అనుమతి అవసరమైనందున.. విజిలెన్స్‌ సిఫారసుతోపాటు ఏసీబీ నివేదికను గవర్నర్‌కు సీఎస్‌ పంపించారు. దీనిపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ బుఽధవారం న్యాయనిపుణుల అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయం అందిన తర్వాత కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌పై గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌ సహా ఐదుగురిని నిందితులుగా ఏసీబీ పేర్కొన్న విషయం తెలిసిందే. వీరిలో ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థ, త్రైపాక్షిక ఒప్పందంలో కీలకమైన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థ ఎండీ, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఉన్నారు.


ఒప్పందం దగ్గర్నుంచి చెల్లింపుల దాకా..

ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి ఒప్పందం దగ్గర్నుంచి డబ్బు చెల్లింపు దాకా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఎఫ్‌ఈవోకు రెండు విడతలుగా డబ్బు చెల్లించారని, విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిగాయని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని వివరించినట్లు సమాచారం. ఇదంతా ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ఆదేశాల మేరకే జరిగిందనడానికి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించామని పేర్కొన్నట్లు సమాచారం. కాగా, క్యాబినెట్‌ అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో డబ్బును హెచ్‌ఎండీఏ నిధుల నుంచి చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరిగిందో తెలుపుతూ పురపాలకశాఖ కార్యదర్శి హోదాలో దానకిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో గత ఏడాది ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ వెంటనే మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌తోపాటు నిందితులందరినీ పలుమార్లు ఏసీబీ, ఈడీ అధికారులు వేర్వేరుగా విచారించి ఆధారాలు సేకరించారు. కేటీఆర్‌ అప్పట్లో వాడిన సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ ఇవ్వాలని ఏసీబీ నోటీసులు జారీ చేసినప్పటికీ.. వాటిని ఇవ్వకుండా కేటీఆర్‌ ఏసీబీని ప్రశ్నిస్తూ లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

అరవిందకుమార్‌పై చర్యకు కేంద్రానికి లేఖ..

అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో ఐపీసీ సెక్షన్లకు సంబంధించి తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే అరవింద్‌కుమార్‌ ఐఏఎస్‌ అధికారి కావడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన సెక్షన్లలో ప్రాసిక్యూషన్‌ చర్యలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. దీంతో కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖకు ఏసీబీ రిపోర్టు, విజిలెన్స్‌ నివేదికను జత చేసి.. అరవింద్‌కుమార్‌పై పీసీ యాక్ట్‌ ప్రకారం చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనున్నట్లు సమాచారం.

Updated Date - Sep 25 , 2025 | 04:56 AM