Share News

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:31 AM

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
పురస్కారాలు అందజేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు

మునుగోడు, చౌటుప్పల్‌ టౌన్‌, చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబర్చిన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య బోధన అందుతుందన్నారు. తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదివనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ ప్రైవేట్‌ స్కూళ్లపై మోజు పెంచుకున్న కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను స్టేటస్‌ కోసమే చదివిస్తున్నారన్నారు. కూలి చేసుకునే పేదలు సైతం కష్టపడుతూ తన కష్టంలో 75శాతం పిల్లల చదువుకే ఖర్చు చేస్తున్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ చైర్‌ప్సన్‌ కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 62పాఠశాలల నుంచి 189మంది విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు మొత్తం రూ.21లక్షలు నగదు బహుమతులుగా ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్‌ మార్కెట్‌ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్‌ మునుగోడు అసెంబ్లీ కో-ఆర్డినేటర్‌ పబ్బు రాజుగౌడ్‌, డీఈవో సత్యనారాయణ, ఎంఈవో గురువారావు, బోయ దేవేందర్‌, సుర్వి నర్సింహ, రమేష్‌, విప్లవ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని దండుమల్కాపురంలోని ఆందోళ్‌ మైసమ్మ ఆలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు పూజలు నిర్వహించారు.

Updated Date - Jul 07 , 2025 | 12:31 AM