Share News

kumaram bheem asifabad- గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:37 PM

జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ కాంతిలాల్‌ సుభాస్‌ పాటిల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై పోలీసు, రెవెన్యూ, సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, రవాణా గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్‌, వ్యవసాయ అటవీ శాఖల అధికారుతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పాల్గొన్న ఎస్పీ కాంతిలాల్‌ సుభాస్‌ పాటిల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ కాంతిలాల్‌ సుభాస్‌ పాటిల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై పోలీసు, రెవెన్యూ, సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, రవాణా గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్‌, వ్యవసాయ అటవీ శాఖల అధికారుతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాలు జరగ కుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ముఖ్యంగా జిల్లాలో గంజాయి సాగు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినట్లయితే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా లభించే పథకాల లబ్ధిని రద్దు చేయాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు, కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యా సంస్థల పరిసరాలలో గల కిరాణ దుకాణాలు, పాన్‌ టేలాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. సరిహద్దు జిల్లా అయినందున పక్కా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. ఆటో, లారీ డ్రైవర్లు, కూలీలకు అవగామన కల్పించాలని తెలిపారు. మందుల దుకాణాలలో మత్తు పదార్థాలకు సంబంధించిన విక్రయాలపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 26న అంతర్జాతీయ డ్రగ్స్‌ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు మహిళా సంఘాలతో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎస్పీ కాంతిలాల్‌ సుభాష్‌ పాటిల్‌ మాట్లాడుతూ వచ్చే రెండు నెలల్లో పోలీసు కళాజాతా బృందం చేత ప్రతీ సోమవారం, గురువారం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనార్ధాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించినా, వినియోగించినా వాటిని గుర్తించి వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా రవాణాధికారి రాంచందర్‌, జిల్లా మాధ్యమిక అధికారిణి కళ్యాణి, వ్యవసాయ, విద్య, ఆబ్కారీ, జాతీయ రహదారుల డ్రగ్స్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేయూత పింఛన్‌పై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్‌లకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, సెర్చ్‌ డైరెక్టర్‌ గోపాల్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైందని చెప్పారు. ప్రతి పథకంలో వారిని భాగస్వామ్యం చాలా అవసరమని అన్నారు. పేదవారికి అందిస్తున్న చేయూత పింఛన్‌ ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, చనిపోయిన పింఛన్‌దారుడు స్థానంలో కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి మంజూరుపై పరిశీలన జరిపి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. 21 రకాల దివ్యాంగ పరీక్షలు సదరం క్యాంపులలో నిర్ధారిస్తున్నారని అన్నారు. పింఛన్‌ ఎంపికలో దరఖాస్తుదారుడికి ఆర్థిక పరిస్థితి పరిశీలించాలని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు గిరిజన గ్రామాలలో ప్రధాన మంత్రి జుగా పథకం కింద నిర్వహిస్తున్న శిబిరాలకు పంచాయతీ కార్యదర్శులు హాజరై గిరిజనులకు ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డులు లేని వారిని గుర్తించాలన్నారు. గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగనిద్దారణ చేసి అవసరమైన మందులు అందించాలని తెలిపారు. అలాగే వనమహోత్సవం, ఇందిరమ్మ ఇంటి నిర్మాణా లు, వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలు, డ్రగ్‌ డే, తదితర విషయా లపై సమీక్షించారు. అనంతరం స్వచ్చ సర్వేక్షన్‌ గ్రామీణ్‌-2025 కార్యక్రమం సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జడ్పీసీఈవో లక్ష్మీనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, కమర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద జిల్లాలోని 95.975 మంది రైతుల ఖాతాలలో రూ 109 కోట్ల 85 లక్షలను వానాకాలం పెట్టుబడి సయయం నగదును బుధవారం వరకు జమ చేసిందని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 1.42, 386 మంది రైతులకు రూ. 264 కోట్ల 30 లక్షల పెట్టుబడి సహాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం వరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న 95,975 మంది రైతులకు పెట్టుబడి సా యం అందిందని, త్వరలోనే మిగతా వారికి అందనుందని తెలిపారు.

Updated Date - Jun 18 , 2025 | 11:37 PM