Minister Tummala Inaugurates Khammam ATC:అధునాతన సాంకేతికతపై సర్కారు శిక్షణ
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:52 AM
సాంకేతిక రంగంలో మార్పులకనుగుణంగా జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తెలంగాణ విద్యార్థులకు అధునాతన...
ఖమ్మం ఏటీసీ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల
ఖమ్మం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సాంకేతిక రంగంలో మార్పులకనుగుణంగా జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తెలంగాణ విద్యార్థులకు అధునాతన సాంకేతిక నైపుణ్యంపై తమ సర్కారు శిక్షణనిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం ఐటీఐలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఐటీఐలో టాటా స్కిల్ డెవల్‌పమెంట్ సహకారంతో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను సందర్శించిన తుమ్మల.. ఆయా కోర్సులతో ఉపాధి, ఉద్యోగావకాశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచీకరణ మార్పులకనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఏటీసీ కోర్సును డిజైన్ చేశారని తుమ్మల పేర్కొన్నారు.
ఓట్ చోరీకి వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణ
ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. బీజేపీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఖమ్మంలో సోమవారం ఒక్కరోజే లక్ష మంది వద్ద సంతకాలు సేకరించారు. అనంతరం ‘ఓట్ చోరీ’ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఒక్క రోజే లక్ష సంతకాలు సేకరించి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన ఘనత ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలదని కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.