Government Orders Vigilance Probe: ఐడీపీఎల్ కేడీలకు తప్పని ఇబ్బందులు!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:59 AM
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్ని, నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వసతుల కల్పనకు అనుమతులిచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది....
అధికారులపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్ని, నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వసతుల కల్పనకు అనుమతులిచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ అనంతరం.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ‘రూ.4 వేల కోట్ల ఐడీపీఎల్ భూములు కృష్ణార్పణం’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్‌లోని ఐడీపీఎల్ పరిశ్రమకు చెందిన విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించి, వివిధ శాఖల అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడడం కలకలం రేపింది. కబ్జాలకు పాల్పడుతున్న వారికి మద్దతుగా.. వారు కోరుకున్న అనుమతులు ఇచ్చుకుంటూ పోయారు. ఇండస్ట్రియల్ జోన్ అని తెలిసి కూడా.. జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు శాఖ, వాటర్‌బోర్డు అనుమతులిచ్చేందుకు పోటీపడ్డాయి. రాజకీయ ఒత్తిడితో.. ఈ భూములకు రెసిడెన్షియల్ లేఅవుట్‌లకు ఇచ్చే రోడ్లు, విద్యుత్, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించాయి. ఈ మొత్తం వ్యవహారంపై మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి.. లోతైన విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించిన ఆయన.. వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులు చూసి నివ్వెరపోయారు. ఆంధ్రజ్యోతి కథనంలోని అంశాలకు పరిగణలోకి తీసుకుని.. విచారణ అనంతరం ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపనున్నారు. ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో అనుమతులు ఇచ్చిన అధికారుల్లో అలజడి మొదలైంది. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినవారిలో వివిధ విభాగాలకు చెందిన సుమారు 55 మంది అధికారులున్నట్లు తెలిసింది.