Share News

IDPL Land Encroachments: ఆక్రమణదారులపై కేసులు పెట్టండి

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:18 AM

ఐడీపీఎల్‌ భూముల ఆక్రమణలపై గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఐడీపీఎల్‌కు కేటాయించిన మొత్తం 902 ఎకరాల భూములను.....

IDPL Land Encroachments: ఆక్రమణదారులపై కేసులు పెట్టండి

  • ఐడీపీఎల్‌కు కేటాయించిన భూములన్ని 22ఎ లో చేర్చండి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సర్కారు స్పందన .. నివేదిక ఇవ్వాలని మేడ్చల్‌ కలెక్టర్‌కు సీఎంవో ఆదేశం

హైదరాబాద్‌, మేడ్చల్‌, డిసెంబరు 11 (ఆంధ్ర జ్యోతి): ఐడీపీఎల్‌ భూముల ఆక్రమణలపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఐడీపీఎల్‌కు కేటాయించిన మొత్తం 902 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో (22ఎ)పెట్టాలని ఆదేశించింది. ఆక్రమణలపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని మేడ్చల్‌ కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరిని.. సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి ఆదేశించారు. ఆక్రమణలను తొలగించాలని, భూములను కబ్జా చేసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశ్రమకు కేటాయించిన భూములను గురువారం రాత్రే ‘22ఎ’లోపెట్టి.. ఐడీపీఎల్‌ భూముల క్రయవిక్రయాలకు అనుమతులు ఇవ్వొద్దని తెలుపుతూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ హనుమంతుకు లేఖ రాశారు. ఐడీపీఎల్‌ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు.. కలెక్టర్‌ మను చౌదరి కూడా ‘ఆంధ్రజ్యోతి’ కథనం నేపథ్యంలో ఐడీపీఎల్‌ భూముల ఆక్రమణపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ తీయిస్తున్నామని వెల్లడించారు. గురువారం ఉదయమే ఐడీపీఎల్‌ జీఎంని పిలిపించుకుని.. సంస్థకు చెందిన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎంత భూమి కబ్జాకు గురైంది? అనే విషయాలను ఆరా తీశారు. ఐడీపీఎల్‌ భూములకు సంబందించిన రికార్డున్నింటినీ తీసి పరిశీలించాలని ఆర్డీవోను ఆదేశించారు. ఐడీపీఎల్‌ భూముల్లో నిర్మాణ అనుమతులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐడీపీఎల్‌ భూములు కబ్జాకు గురికాకుండా తగిన చర్యలు చేపడుతామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఐడీపీఎల్‌ భూముల కబ్జాపై తనకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని, ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం ఆధారంగానే విచారణకు ఆదేశించానని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు.. పరిశ్రమ భూముల ఆక్రమణలను గుర్తించేందుకు ఆర్డీవో, సర్వేయర్‌ నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. అక్కడ 1100 నివాసాలు ఉన్నాయని గుర్తించి.. ఆ మేరకు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. కాగా.. పరిశ్రమ చుట్టుపక్కల ఎంత భూమి ఆక్రమణలకు గురైంది? దీని వెనుకాల ఎవరు ఉన్నారనే కోణంలో పూర్తి స్థాయి విచారణ అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Updated Date - Dec 12 , 2025 | 04:18 AM