Water Bill: ప్రభుత్వ ఆఫీసుల నుంచి.. వాటర్ బోర్డుకు రూ.2 వేల కోట్ల బకాయిలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:27 AM
ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ వాటర్ బోర్డుకు బకాయిపడిన నీటి పన్నును చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్...
ఆ నీటి పన్నులు కట్టాలని ఆదేశాలివ్వండి
సీఎం రేవంత్‌రెడ్డికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడి లేఖ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ వాటర్ బోర్డుకు బకాయిపడిన నీటి పన్నును చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) కోరింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. వాటర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రూ.1,764.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రూ.250.23 కోట్ల నీటి పన్ను బకాయి పడినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసిందని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి బిల్లులు సకాలంలో వసూలు కాకపోవడంతో వాటర్ బోర్డు సామాన్య ప్రజలకు అందించే సేవలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ దృష్ట్యా వాటర్ బోర్డుకు ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలను చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎంను కోరారు. కాగా, మిషన్ భగీరథ సంస్థ నుంచి రూ.1,011.3 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.377.29కోట్లు, ఆరోగ్య శాఖ నుంచి రూ.109.69 కోట్లు, గృహ నిర్మాణ శాఖ నుంచి రూ.57.55 కోట్లు, మునిసిపల్ శాఖ నుంచి రూ.33.05కోట్లు, పోలీసు శాఖ నుంచి రూ.40.86కోట్లు, సాధారణ పరిపాలన శాఖ నుంచి రూ.25.02కోట్లు, ఆర్‌అండ్‌బీ నుంచి రూ.17.71కోట్లు, విద్యాశాఖ నుంచి రూ.19కోట్లు, యూనివర్సిటీలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు తదితర ప్రభుత్వ సంస్థల నుంచి వాటర్ బోర్డుకు రూ.1764.18కోట్లు రావాల్సి ఉంది.