Share News

Government offices: కిరాయికి వద్దు.. సొంతగూళ్లకు చేరండి

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:13 AM

ఖజానాకు భారంగా మారిన అద్దెల చెల్లింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల విషయంలో....

Government offices: కిరాయికి వద్దు.. సొంతగూళ్లకు చేరండి

  • అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల 31 నాటికి సర్కారు భవనాల్లోకి మారాల్సిందే

  • 1 నుంచి సొంత భవనాల్లోనే..

  • ఫిబ్రవరి 1 నుంచి అద్దెలు ఇవ్వం

  • అన్ని శాఖలకు సర్కారు ఆదేశాలు

  • వర్సిటీలు, కార్పొరేషన్లు సహా ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు వర్తింపు

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఖజానాకు భారంగా మారిన అద్దెల చెల్లింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రైవేటు భవనాలను తక్షణమే ఖాళీ చేసి ఆ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించింది. డిసెంబరు 31 నాటికి కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోకి మారాలని, జనవరి 1 నుంచి కార్యకలాపాలు ప్రభుత్వ భవనాల నుంచే జరగాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులకు నిధులు విడుదల చేయమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (మెమో 3469202-ఏ/310/డబ్ల్యూపీ/ఏ1/2025) అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న కార్పొరేషన్లు, సంఘాలు, యూనివర్శిటీలతోపాటు ఇతర కార్యాలయాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అనేక ప్రభుత్వ భవనాల్లో అదనపు స్థలం అందుబాటులో ఉందని, ప్రైవేటు భవనాల్లోని కార్యాలయాలు ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అయితే, ఈ ఉత్తర్వులు జిల్లాల్లోని కార్యాలయాలకు వర్తిస్తాయా ? లేదా రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు మాత్రమేనా ? అనేది తెలియాల్సి ఉంది.


30 శాతం ప్రైవేటు భవనాల్లోనే..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 30 శాతం ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే ఉన్నట్టు సమాచారం. కొన్ని విభాగాలైతే ఏళ్లుగా ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు భవనంలో 8 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌కు చెందిన పలు విభాగాలు, స్త్రీ నిధి, సెర్ప్‌తోపాటు మైనింగ్‌ శాఖలు అక్కడే కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. టీ-ఫైబర్‌ కూడా ప్రైవేటు భవనంలోనే ఉంది. ఇలా మరికొన్ని శాఖల కార్యాలయాలు కూడా ప్రైవేటులోనే కొనసాగుతున్నాయి. వీటి అద్దెల నిమిత్తం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు అవుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

10 రోజుల్లో మారాలంటే ప్రహసనమే

ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికారిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. శనివారం రాత్రి 11.30 గంటల తర్వాత సర్క్యులర్‌ ఇచ్చి డిసెంబరు 31వ తేదీ వరకే గడువు ఇవ్వడంపై కొందరు ఆందోళన చెందుతున్నారు. 10 రోజుల్లో కార్యాలయం మొత్తాన్ని మార్చాలంటే ప్రహసనమే అంటున్నారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలకు సంబంధించి లీజు అగ్రిమెంట్లు ఉంటాయి. దాంతోపాటు కొన్ని నెలల అడ్వాన్సులు కూడా ప్రైవేటు భవనాల యజమానుల దగ్గర ఉన్నాయి. దీంతో ఇప్పటికప్పుడు ప్రైవేటు స్థలాన్ని ఖాళీ చేయాలంటే ఇబ్బందులు తప్పవని, న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రైవేటు భవనాల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు తమ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాల్లో స్థలం కేటాయించాలని గతంలో పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదని సమాచారం. అయితే, బీఆర్కే భవన్‌, అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌, మరికొన్ని భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుకు స్థలం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఏయే విభాగాలు ఏ భవనంలోకి వెళ్లాలి ? ఆ కార్యాలయానికి అవసరమైన మేర స్థలాన్ని కేటాయిస్తారా? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టతనిస్తే బాగుండేదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - Dec 22 , 2025 | 05:13 AM