Bhadrachalam Model: భద్రాద్రి మోడల్ భేష్
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:29 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఆస్పత్రులు ప్రజారోగ్య సేవల్లో ఆదర్శ కేంద్రంగా నిలుస్తున్నాయి. జిల్లా పరిధిలో భద్రాచలం....
‘‘ చర్ల మండలం జిపి పల్లికి చెందిన రంగారావు అనే వ్యక్తి కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా.. చివరకు డాక్టర్లు ఇక లాభం లేదని చేతులెత్తేశారు. చర్ల సీహెచ్‌సీ వైద్యులు వారం పాటు వైద్యం చేసి రంగారావును బతికించారు.’’
‘‘మరో వ్యక్తి పారాక్వాట్ అనే ప్రమాదకర గడ్డి మందు తాగాడు. ఆ మందు తాగితే 99 శాతం బతకడం కష్టం. కానీ అశ్వారావు పేట సీహెచ్‌సీ వైద్యులు ఆ వ్యక్తికి నెల రోజుల పాటు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. ఇటువంటి కేసులు ప్రైవేటులో వైద్యం చేయిస్తే కనీసం రూ. 20 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడా ఆ ఆస్పత్రికి గడ్డిమందు తాగిన కేసుల్ని ఏకంగా మంత్రులు సైతం బతికించమని పంపుతున్నారు.’’
‘‘భద్రాచలం సర్కారీ దవాఖానాలో ఓ నవజాత శిశువు కేవలం 800 గ్రాముల బరువుతో జన్మించింది. అక్కడి ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్)లో ఉంచిన వైద్యులు.. రెండు నెలల పాటు ఆ శిశువుకు వైద్యం చేసి కాపాడారు. ఇదొక్కటే కాదు అక్కడికి వచ్చే ఎన్నో క్లిష్టమైన పసిపిల్లల కేసుల్ని ధృడ సంకల్పంతో నాణ్యమైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.’’
ఏజెన్సీ ఆస్పత్రులైనా.. ఏడు దవాఖానాల్లో అత్యుత్తమ చికిత్స
సర్కారీ దవాఖానాల్లో అమలుకు ప్రభుత్వ యోచన.. మిగతా ఐటీడీఏ ప్రాంతాల్లోనూ
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఆస్పత్రులు ప్రజారోగ్య సేవల్లో ఆదర్శ కేంద్రంగా నిలుస్తున్నాయి. జిల్లా పరిధిలో భద్రాచలం, అశ్వరావుపేట, మణుగూరు, ఇల్లందు ప్రాంతీయ ఆస్పత్రులతో పాటు పాల్వంచ, బూర్గంపహాడ్, చర్లలలో సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒకప్పుడు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు తీవ్ర సంక్షోభంలో ఉండేవి. ఇప్పుడు అత్యుత్తమ సేవలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇటీవలే కేంద్రం నుంచి వచ్చిన జాతీయ కామన్ రివ్యూ మిషన్(సీఆర్‌ఎమ్) బృందం అక్కడి ఆస్పత్రుల పనితీరును ప్రశంసించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఈ విజయవంతమైన ‘భద్రాద్రి మోడల్’ను రాష్ట్రంలోని మిగతా సర్కారీ దవాఖానాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీవీవీపీ కమిషనర్ డా. అజయ్ కుమార్ జిల్లాలోని ఆస్పత్రులను సందర్శించి సర్కారుకు నివేదిక అందించారు. మెరుగైన వైద్య సేవలందిస్తున్నందుకు గాను డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్ రవికుమార్‌ను ఆదివారం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సచివాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు.
గణనీయంగా పెరిగిన ఓపీ
్ల మెరుగైన వైద్య సేవలు, ఆధునిక వసతుల కారణంగా టీవీవీపీల్లో ఔట్ పేషెంట్ల(ఓపీ)ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. క్లిష్టమైన కేసులను కూడా ఇక్కడి వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా పరిష్కరిస్తుండడంతో, ప్రజల్లో కూడా మరింత నమ్మకాన్ని పెంచింది. ప్రస్తుత జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ , డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు నిరంతర పర్యవేక్షణ, టీవీపీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మార్పు సాధ్యపడిందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ పాటిల్‌తో పాటు ఐటీడీఏ పీఓ రాహుల్ వారి సతీమణులను ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు చేయించి, ఆదర్శంగా నిలిచారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఇల్లెందు ఆస్పత్రి ేసవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అఽధునాతన వైద్య పరికరాల సంఖ్య పెంచడం ద్వారా క్లిష్టమైన రోగ నిర్ధారణతో పాటు సరైన సమయంలో చికిత్సలను అందించడం సులభతరం చేసింది. గతంలో జిల్లాలో 30 డయాలసిస్ మెషీన్లు ఉండగా, ప్రస్తుతం అవి 53కు పెరిగాయి. మూడు బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య ఆరుకు పెరగడంతో తలసేమియా, అనీమియా బాధితులకు, గర్భిణీలకు వరంగా మారింది. గర్భస్థ శిశువు ఎదుగుదలలో లోపాలను గుర్తించే అత్యాధునిక ‘టిఫా స్కాన్’ యంత్రాలు జిల్లాలోని ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. మోకీలు మార్పిడి ఆపరేషన్లు, క్రిటికల్ కండీషన్‌లో ఉన్న చిన్నారులకు ఎన్‌ఐసీయూలో చికిత్సలు అందుతున్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వైద్యులు, సిబ్బంది మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలు కలిగిందని డీసీహెచ్ తెలిపారు. ఖరీదైన చికిత్సల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా ప్రజారోగ్యానికి పెద్ద ఊరట లభించింది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, ఉన్న వనరులతోనే నాణ్యమైన ేసవలు అందిస్తూ భద్రాద్రి జిల్లా ఆసుపత్రులు ‘శభాష్’ అనిపించుకుంటున్నాయి.
ఆస్పత్రుల్లో ప్రగతి ఇలా..
ఇల్లందు, అశ్వారావు పేట ఆస్పత్రుల్లో నెలకు 50కి పైగా డెలివరీలు
మణుగూరులో ఒకప్పుడు 8 ఉండే ప్రసవాల సంఖ్య ఇప్పుడు ఏకంగా 100కిపైగా నమోదు
చర్ల ఆస్పత్రిలో ఆరు ఉండే డెలివరీలు నేడు 25కు పైగా రికార్డు
ఇల్లందు ఆస్పత్రిలో ఓపీల సంఖ్య 100 నుంచి 900 పెరుగుదల
అశ్వారావుపేటలో రోజు 70 నుంచి 400కు చేరిన ఓపీలు
మణుగూరులో 600లకు పెరగగా, చర్ల ఆస్పత్రిలో 300 వరకు ఓపీలు