Uttam Kumar Reddy: దేవాదుల పూర్తికి సర్కార్ కట్టుబడి ఉంది
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:23 AM
దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదలశాఖ మంత్రి..
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం: ఉత్తమ్
హైదరాబాద్/వరంగల్/చేర్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో దేవాదుల ప్రాజె క్టు పురోగతిపై మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదులలోని అన్ని ప్యాకేజీలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేస్తామని, పాలనపరమైన అడ్డంకులన్నీ తొలగించి, వేగవంతంగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు 5.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.17 లక్షల ఎకరాలకు నీరందుతోందన్నారు. ప్రాజెక్టు సవరణ అంచనా వ్యయం రూ.18,500 కోట్లు కాగా.. ఇప్పటిదాకా రూ.14,269 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. ప్రాజెక్టు మూడో దశలోని మిగిలిన భూసేకణ, లైనింగ్, మెకానికల్ పనులన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కాగా, దేవాదుల-8 ప్యాకేజ్‌లో భాగంగా జనగామ నియోజకవర్గంలోని తపా్‌సపల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల పరిధిలోని అసంపూర్తి కాలువ పనులను పూర్తి చేయాలని, భూసేకరణ నిధులను రైతులకు వెంటనే చెల్లించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌ను కోరారు. ఆయా అంశాలపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వినిరెడ్డి, సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.