Telangana Government: 15 వేల జీవోలు దాచిపెడతారా?
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:34 AM
రాష్ట్ర సర్కారు జారీ చేసే జీవోలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలను దాచి పెడుతోందంటూ...
43 వేల జీవోలను దాచిందెవరు..?: ఎంపీ చామల
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సర్కారు జారీ చేసే జీవోలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలను దాచి పెడుతోందంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించగా.. తెలంగాణ వచ్చాక.. మొదటి ఐదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున జీవోలను చీకట్లో పెట్టిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోపు బహిర్గతం చేయాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘‘ప్రజా ప్రభుత్వమని చెప్పుకోవడం కాదు రేవంత్‌రెడ్డి.. చీకటి జీవోల మాటున నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్. 7-12-2023 నుంచి 26-01-2025 వరకు 13 నెలల్లో 19,064 జీవోలు జారీ కాగా, వాటిలో 3,290 జీవోలను మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏంటి..? ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు దాచిపెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? రేవంత్.. ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం..?’’ అని హరీశ్ ప్రశ్నించారు. హరీశ్ పోస్టులకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. ‘‘43,462.. ఏంటి ఈ నంబర్ అని బుర్ర గోక్కుంటున్నారా..? మీ మామ మొదటి ఐదేళ్ల పాలనలో దాచిపెట్టిన జీవోల సంఖ్య. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న తీరుగా మాట్లాడితే ఎలా సార్’’ అంటూ చామల విమర్శించారు.