Share News

Hospital Controversy: గోపీనాథ్‌ చనిపోయింది ఎప్పుడు?

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:12 AM

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతిపై ఆయన తల్లి మాగంటి మహానందకుమారి అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్‌ చివరి దశలో...

Hospital Controversy: గోపీనాథ్‌ చనిపోయింది ఎప్పుడు?

  • ఆయన మరణం మిస్టరీగా ఉంది

  • కేటీఆర్‌ వచ్చాక చనిపోయినట్టు చెప్పారు

  • గోపీనాథ్‌ తల్లి మహానందకుమారి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతిపై ఆయన తల్లి మాగంటి మహానందకుమారి అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్‌ చివరి దశలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన్ను చూసేందుకు తనతోపాటు కుటుంబసభ్యులు ఎవ్వరినీ అనుమతించలేదని ఆమె తెలిపారు. గోపీనాథ్‌ ఎప్పుడు మరణించారో కూడా తమకు తెలియదని, జూన్‌ 5న తుదిశ్వాస విడిచారా? జూన్‌ 8వ తేదీనా? అనే సందేహం ఉందని పేర్కొన్నారు. కేటీఆర్‌ అమెరికా నుంచి వచ్చిన వెంటనే గోపీనాథ్‌ 8న మరణించారని ప్రకటించారని, అదేరోజున హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశారని.. ఇదంతా మిస్టరీగా అనిపిస్తోందన్నారు. గోపీనాథ్‌ మొదటి భార్య మాలి ని, మనుమడు తారక్‌ ప్రద్యుమ్నతో కలిసి మహానంద కుమారి.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్‌ను తల్లినైన తనను ఎందుకు చూడనివ్వలేదని ప్రశ్నించారు. డయాలసిస్‌ చేయించుకోవాల్సిన గోపీనాథ్‌ను సహాయకుడు కూడా లేకుండా ఆస్పత్రిలో వదిలేసి సునీ త ఎందుకు బయటకు వెళ్లిందో తెలియదన్నారు. గోపీనాథ్‌ను చూసేందుకు కుటుంబసభ్యులను కూడా అనుమతించవద్దని సునీత ఆస్పత్రి యాజమాన్యానికి లేఖ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆస్పత్రి వద్ద కేటీఆర్‌ను కలిసి బాధ చెప్పుకోవాలని ఆయన కారు వెంట పరుగెత్తినా తనని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ 8న ఉదయం ఎనిమిది గంటలకు గోపీనాథ్‌ భౌతికకాయాన్ని తీసుకొచ్చి అదేరోజు సాయంత్రం ఐదు గంటల కల్లా అంత్యక్రియలు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. గోపీనాథ్‌ జూన్‌ 8న మరణించగా.. అదే నెల 25న సునీత చట్టపరమైన వారసత్వం (లీగల్‌ హెయిర్‌) కోసం దరఖాస్తు చేసుకోగా జూలై 4న సర్టిఫికెట్‌ జారీ అయ్యిందన్నారు. అయితే, ఆ సర్టిఫికెట్‌లో తనతోపాటు మాలిని, ప్రద్యుమ్న పేర్లు లేవని, దాంతో ఆగస్టు 11వ తేదీ నుంచే ఈ విషయంపై తాము మాట్లాడుతున్నామన్నారు. పార్టీలతో, టికెట్‌తో తమకు సంబంధం లేదని, కుటుంబ విషయమని, చట్టపరమైన గుర్తింపు కోసమే ఇక్కడకు వచ్చామని ఆమె వెల్లడించారు. ఇక, మాలినితో గోపీనాథ్‌కు విడాకులు కాలేదని, తాను గోపీనాథ్‌, సునీతల వివాహం చేయలేదని ఆమె తెలిపారు.


మాకు గుర్తింపు లేదు: తారక్‌ ప్రద్యుమ్న

తారక్‌ ప్రద్యుమ్న అంటే ఎవరో తనకు తెలియదన్న సునీత తనకు ఎందుకు ఫోన్లు చేశారో చెప్పాలంటూ మాగంటి గోపీనాథ్‌ కుమారుడు తారక్‌ ప్రద్యుమ్న ప్రశ్నించారు. సునీత జూన్‌ 6న తనకు తొలిసారి ఫోన్‌ చేశారని చెప్పారు. ఆ తర్వాత సునీ త తనతో మాట్లాడుతూ.. ‘‘నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు. రెజ్యూమె పంపిస్తే కేటీఆర్‌ అంకుల్‌ కంపెనీ్‌సలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు’’ అని చెప్పారని ప్రద్యుమ్న వెల్లడించారు. ఆయా ఫోన్‌ కాల్స్‌కు సంబంధించిన ఆధారాలను ప్రద్యుమ్న ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ తనకు కాల్‌ చేసి ‘నువ్వు రావాల్సిన అవసరం లేదు’ అని చెప్పారన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 03:19 AM