Share News

రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:36 AM

ప్రజలకు మేలు జరగాలనేది తన ఆకాంక్ష అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

యాదగిరిగుట్ట, భువనగిరి టౌన్‌ అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మేలు జరగాలనేది తన ఆకాంక్ష అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గురువారం సందర్శించారు. భువనగిరి, యాదగిరిగుట్టలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే జనం బాట కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. సుమారు నాలుగు నెలలపాటు నిర్వహించే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. తిరుపతి తర్వాత యాదగిరిగుట్ట దేవాలయాలను దర్శించుకున్నామన్నారు. నిజామాబాద్‌ నుంచి చేపట్టబోయే జనంబాట కార్యక్రమం విజయవంతానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా స్వామిని వేడుకున్నామన్నారు. ప్రతీ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. భవిష్యత్తులో తాము అనుసరించే వైఖరిని ప్రజాబాటలో వెల్లడిస్తామన్నారు.

ఆలయ ప్రాశ్యస్తాన్ని కాపాడాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ నేతృత్వంలో యాదగిరిగుట్ట ఆలయం అద్భుతంగా నిర్మితమైందని కవిత తెలిపారు. ఆలయ ప్రాశ్యస్తాన్ని కాపాడేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తిరుపతిలో స్వామివారి హోర్డింగులు, చిత్రపటాలవలె కాకుండా విచిత్రమైన హోర్డింగులు ఇక్కడ వెలిశాయన్నారు. ఇక్కడ నెలకొన్న సమస్యలపై మళ్లీ వచ్చినప్పుడు వివరిస్తానన్నారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సుజిత్‌రావు, ప్రచార కార్యదర్శి దుగుంట్ల నరేష్‌, కోల శ్రీనివాస్‌, బాలకృష్ణ, ఎత్తరి మారయ్య, రాంకోటీ ప్రజాపతి, గోపు సదానంద, యూనైటెడ్‌ పూలె ఫ్రంట్‌ రాష్ట్ర కన్వీనర్‌ బొల్ల శివశంకర్‌ పాల్గొన్నారు.

స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

స్వామిని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకోగా గర్భాలయంలోని స్వయంభువులకు ప్రత్యేక పూజలుచేశారు. ఆలయ సంప్రదాయ మేరకు ఎమ్మెల్సీకి పూజారులు స్వాగతం పలికారు. వేద మండపంలో పండితులు వేద ఆశీర్వచనంచేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు స్వామివారికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు.

Updated Date - Oct 24 , 2025 | 12:36 AM