Gold Price Surge: బంగారం ధర రూ.1.35 లక్షలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:33 AM
ధన త్రయోదశి నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది.
ఆల్‌టైం రికార్డు స్థాయికి పసిడి.. ఒక్కరోజులోనే రూ.3,200 పెరుగుదల
ధన త్రయోదశి నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
స్వల్పంగా తగ్గిన వెండి ధర
10 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం!
సేవలను ప్రారంభించిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ తదితర క్విక్ కామర్స్ సంస్థలు
న్యూఢిల్లీ, అక్టోబరు 17: ధన త్రయోదశి నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.3,200 పెరిగి.. సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,34,800కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి కూడా ఆల్‌టైమ్ రికార్డు స్థాయి రూ.1,34,200కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కె ట్లో ధరలు భారీగా పెరగడంతోపాటు దేశీయంగా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కూడా దీనికి కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. మరోవైపు వెండి మాత్రం కిలోకు రూ.7,000 తగ్గి రూ.1,77,000కు దిగివచ్చింది. కాగా, వచ్చే ఏడాది దీపావళి నాటికి 10 గ్రాముల పసిడి రూ.1.50 లక్షల స్థాయికి చేరుకోవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 4,300 డాలర్ల స్థాయిని దాటింది. ఈ వారంలోనే 8 శాతానికిపైగా పెరగడం గమనార్హం. అమెరికా-చైనా మధ్య మళ్లీ మొదలైన వాణిజ్య యుద్ధం, యూఎస్ షట్‌డౌన్ వంటి ప్రతికూలతలకుతోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు బులియన్ మార్కెట్లో డిమాండ్ పెంచినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.
భారత బంగారం నిల్వలు రూ.8.80 లక్షల కోట్లకు..
భారత ప్రభుత్వ పసిడి నిల్వల విలువ తొలిసారిగా 100 బిలియన్ డాలర్లు (రూ.8.80 లక్షల కోట్లు) దాటింది. బంగారం ధరలు శరవేగంగా దూసుకెళ్తుండటంతో విలువ పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ నెల 10తో ముగిసిన వారంలో విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వల మొత్తం విలువ 218 కోట్ల డాలర్లు తగ్గి 69,778.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అయితే, అందులోని బంగారం నిల్వల విలువ మాత్రం 359.5 కోట్ల డాలర్లు పెరిగి 10,236.5 కోట్ల డాలర్లకు చేరింది. మొత్తం ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 14.7 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినా, ధరలు భారీగా పెరగడంతో విలువ అనూహ్యంగా పెరిగింది. 2024లో మొదటి 9 నెలల్లో (జనవరి-సెప్టెంబరు) 50 టన్నుల బంగారం కొనుగోలు చేసిన ఆర్‌బీఐ.. ఈ ఏడాదిలో అదే కాలంలో కేవలం 4 టన్నులే కొనుగోలు చేసింది.
10 నిమిషాల్లో హోం డెలివరీ
శనివారం ధన త్రయోదశి నేపథ్యంలో ఇంటి నుంచే బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. క్విక్ కామర్స్ సేవల సంస్థ ‘బ్లింకిట్’ ద్వారా ఎంఎంటీసీ-పీఏఎంపీ సంస్థ 24 క్యారెట్ల బంగారం, వెండి నాణేలను అందుబాటులోకి తెచ్చింది. 1 గ్రాము, అరగ్రాము బంగారు నాణాలు, 10 గ్రాముల వెండి నాణాలను విక్రయిస్తున్నారు. బ్లింకిట్‌తో పాటు జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ సైతం ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా 10 నుంచి 30 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం, వెండి డెలివరీ సేవలను ప్రారంభించాయి.