Share News

కూలి కోసం వెళ్తూ..కానరానిలోకాలకు

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:23 PM

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్తూ కానరానిలోకాలకు వెళ్లారు ముగ్గురు మహిళా కూలీలు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం క్రాస్‌ రోడ్డుపై సోమవారం లారీ, బొలేరో వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కూలి కోసం వెళ్తూ..కానరానిలోకాలకు
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న డీసీపీ భాస్కర్‌

బొలేరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ

ముగ్గురు మృతి.. 13 మందికి గాయాలు

జైపూర్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్తూ కానరానిలోకాలకు వెళ్లారు ముగ్గురు మహిళా కూలీలు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం క్రాస్‌ రోడ్డుపై సోమవారం లారీ, బొలేరో వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా చాందినిభూజ్‌ గ్రామానికి చెందిన 23 మంది కూలీలు ఎంహెచ్‌34బీజీ4825 అనే బొలేరో వాహనంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వరినాట్ల కోసం సోమవారం ఉదయం బయలుదేరారు. తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఇందారం క్రాస్‌రోడ్డు సమీపంలో డ్రైవర్‌ మూత్ర విసర్జన చేసేందుకు వాహనాన్ని ఎడమ వైపు రోడ్డు దించుతున్న క్రమంలో శ్రీరాంపూర్‌ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ బొలేరో వాహనాన్ని వెనక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనం అటవీ ప్రాంతంలోని చెట్టును ఢీకొట్టింది. అందులో ఉన్న మహిళా కూలీ మీనాబాటిల్‌ వాల్‌(45) అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లీలాబాయి(60), ఇమ్లిబాయి (48) మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జైపూర్‌ పోలీసులు 108 ద్వారా గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో రోడ్డు పనులు జరుగుతుండడంతో పాటు రోడ్డు పూర్తి కోసుకుపోయి ఉంది. ప్రమాద స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, ఏసీపీ వెంకటేశ్వర్‌, జైపూర్‌ సీఐ నవీన్‌కుమార్‌లు, ఎస్‌ఐ శ్రీధర్‌లు పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:23 PM