Heavy Inflows: శ్రీశైలానికి 6.21లక్షల క్యూసెక్కుల వరద
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:37 AM
కృష్ణ, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.10 లక్షల క్యూసెక్కులను, జూరాలకు...
10 గేట్లు ఎత్తి 5.93 లక్షల క్యూసెక్కుల విడుదల
భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన గోదావరి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కృష్ణ, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.10 లక్షల క్యూసెక్కులను, జూరాలకు 5.37 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 39 గేట్లను ఎత్తి 5.60 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి సోమవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 6.21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పది గేట్లను 23 ఫీట్ల మేర ఎత్తి 5,93లక్షల క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.91 లక్షల క్యూసెక్కుల వరద రాగా... వచ్చింది వచ్చినట్లే 26 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 5.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... ఔట్‌ఫ్లో 5.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు, గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద అత్యధికంగా 11.37లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక, భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 45.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 10,32,816 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.