Share News

Goats Help Catch Thieves: మే..మే.. అంటూ దొంగలను పట్టించిన మేకలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:49 AM

మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి...

Goats Help Catch Thieves: మే..మే.. అంటూ దొంగలను పట్టించిన మేకలు

  • అపహరణకు గురైన మూగజీవాలు.. జియాగూడ మార్కెట్‌లో తమ యజమానిని చూసి అరుపులు

షాద్‌నగర్‌/ చౌదరిగూడ సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి. అపహరణకు గురైన మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్‌లో తమ యజమానిని గుర్తించి పరుగులు పెట్టిన మేకలు.. దొంగలను పట్టించాయి. ఈ ఘటన హైదరాబాద్‌, పాతబస్తీలోని జియాగూడ మార్కెట్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో వెంకటయ్యరు చెందిన 30 మేకలను ఈ నెల 9న గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వెంకటయ్య, అతని కుటుంబసభ్యులు ఆ రోజు నుంచి వాటి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటయ్య కుమారుడు ప్రవీణ్‌ సెప్టెంబరు 11న జియాగూడ మేకల మార్కెట్‌కు వచ్చాడు. అక్కడ ఓ కంటెయినర్‌ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్‌ను చూసి అరవడం మొదలుపెట్టాయి. దీంతో ప్రవీణ్‌ తమ కోడ్‌ బాషలో ఆ మేకలను పిలిచాడు. అంతే ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్‌ దగ్గరికి పరుగు తీశాయి. దీంతో ఆ మంద వద్ద ఉన్న వ్యక్తులను ప్రవీణ్‌ ప్రశ్నించగా.. తాము మేకలను రూ.30 లక్షలకు కొన్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ప్రవీణ్‌ను వారు భయపెట్టేందుకు యత్నించారు. ప్రవీణ్‌ ద్వారా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వెంకటయ్య తదితరులు కుల్సుంపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ మేకలతో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాన్ని అంగీకరించారు. నిందితులను, మేకలను శుక్రవారం రాత్రికి చౌదరిగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.వికారాబాద్‌ జిల్లా పరిగికి చెందిన మరో ముగ్గురు తమ ముఠాలో ఉన్నారని ఆ దొంగలు చౌదరిగౌడ పోలీసులకు వెల్లడించారు. దీంతో చౌదరిగూడ పోలీసులు పరిగికి వెళ్లి ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారు దొంగలించి దాచిపెట్టిన సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Updated Date - Sep 14 , 2025 | 07:28 AM