Goat Theft Gangs: కార్లలో వచ్చి... మేకలు, గొర్రెల చోరీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:22 AM
పగటిపూట కార్లలో వచ్చి రెక్కీ చేసి.. రాత్రిపూట అవేకార్లలో మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్న నాలుగు ముఠాల ఆటను పోలీసులు కట్టించారు. ఈ ముఠాలకు చెందిన 18 మంది..
4 ముఠాల ఆగడాలు.. నల్లగొండలో 16 మంది అరెస్టు
ఇద్దరు పరారీలో.. నిందితుల్లో ఇద్దరు మహిళలు
రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్ల సీజ్
నల్లగొండ క్రైం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పగటిపూట కార్లలో వచ్చి రెక్కీ చేసి.. రాత్రిపూట అవేకార్లలో మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్న నాలుగు ముఠాల ఆటను పోలీసులు కట్టించారు. ఈ ముఠాలకు చెందిన 18 మంది.. ఇప్పటిదాకా 26 ఘటనల్లో రెండొందలకుపైగా జీవాలను దొంగిలించినట్లుగా తేల్చారు. నిందితుల్లో ఇద్దరు మహిళలున్నారు. నల్లగొండలో జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం శాలిగౌరారం మండలం బైరవబండ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ఉన్న ముగ్గురు పురుషులు, ఒక మహిళ వాహనం దిగి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు ఆ నలుగురిని పట్టుకుని వారి వేలిముద్రలను స్కాన్ చేయగా పాత నేరస్థులైన సంపంగి వెంకటేశ్, వేంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్‌కుమార్ అలియా్‌సగా కోటిగా గుర్తించారు. ఈ నలుగురిపై గతంలో నల్లగొండ రూరల్, దేవరకొండ, శాలిగౌరారం సహా జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్లలో మేకల దొంగతనాల కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీరు తమకు పరిచయం ఉన్న మరో 14 మందితో కలిసి 4ముఠాలుగా ఏర్పడి మేకలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లాలోని 15 ప్రాంతాల్లో.. అలాగే రాచకొండ, సైబరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌జిల్లాల్లోని 11 చోట్ల ఈ ముఠాల సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారు. 16 మందిని అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, రూ.17లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో అమ్ములూరి విజయ్ ఏపీకి చెందిన వ్యక్తి.