Minister Ponguleti: అవసరమైతే జీవో 252ను సవరిస్తాం
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:13 AM
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
అక్రెడిటేషన్ కార్డుల అంశంలో ఆందోళన వద్దు
కార్డుల్లోనే తేడా.. సదుపాయాలు, పథకాల్లో కాదు: పొంగులేటి
ఖమ్మం రూరల్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల అభ్యంతరాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైతే జీవో 252కు సవరణలు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలో శనివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ యూనియన్ నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దని, అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించిన జీవోలో మార్పులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టుల కార్డుల్లో తేడా ఉంటుందే కానీ.. సౌకర్యాలు, సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి తేడా ఉండదని తెలిపారు. పెద్ద పత్రికలు, కేబుల్ టీవీలకు అక్రెడిటేషన్ కార్డుల కోటా తగ్గిందన్న అంశం తమ దృష్టికి వచ్చిందని, దాన్ని పరిశీలించి సరి చేస్తామన్నారు. దేశంలోనే అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని పేర్కొన్నారు.