Minister Tummala: వ్యవసాయ రంగానికి సమ్మిట్ దిక్సూచి
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:33 AM
తెలంగాణ వ్యవసాయరంగానికి దిక్సూచిలా గ్లోబల్ సమ్మిట్ దోహదపడుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిజిటల్ స్మార్ట్ దిశగా ....
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యవసాయరంగానికి దిక్సూచిలా గ్లోబల్ సమ్మిట్ దోహదపడుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిజిటల్ స్మార్ట్ దిశగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లోరూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ(రేర్)లో భాగంగా రైతుల ఆదాయం పెంపుదల అనే అంశంపై తుమ్మల మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్థి కార్యక్రమాల కోసం రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టిందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 34.6 బిలియన్ డాలర్లు ఉందన్నారు. 2047నాటికి దీనిని 400 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుమ్మల తెలిపారు. రైతులు ఆధునిక, వ్యవసాయం నుంచిప్రయోజనం పొందాలని కోరుకుంటున్నట్లుతెలిపారు. కాగా, వ్యవసాయ, ఉద్యాన, చేనేత-జౌళి శాఖల ఆధ్వర్యంలో సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తుమ్మల ప్రారంభించారు. ఇక నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థితో తుమ్మల భేటీ అయి.. రాష్ట్రంలో విద్యారంగ పురోగతి, విద్యార్థుల హక్కుల పరిరక్షణ తదితరాలపై చర్చించారు.