Global Metallurgy Experts: లోహ శాస్త్రవేత్తల కుంభమేళా!
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:11 AM
దేశ విదేశాల నుంచి 1,200 మంది లోహశాస్త్ర నిపుణులు హాజరైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ (ఐఐఎం) 79వ అంతర్జాతీయ సదస్సుకు....
ఐఐటీహెచ్‌లో ఐఐఎం 79వ అంతర్జాతీయ సదస్సు
1,200మంది సైంటిస్టుల రాక
కంది, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): దేశ విదేశాల నుంచి 1,200 మంది లోహశాస్త్ర నిపుణులు హాజరైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ (ఐఐఎం) 79వ అంతర్జాతీయ సదస్సుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ-హెచ్‌లో వేదికైంది. మెటలర్జిస్టులు, మెటీరియల్ శాస్త్రవేత్తలకు కుంభమేళాగా అభివర్ణించే ఈ సదస్సు శనివారం వరకు మూడు రోజులపాటు జరగనుంది. లోహ శాస్త్రజ్ఞులను ఒకచోట చేర్చే లక్ష్యంతో 1946లో 42 మంది సభ్యులతో ప్రారంభమైన ఐఐఎంజీ ఎంతో పురోగతి సాధించిందని, ప్రస్తుతం 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారని ఆ సంస్థ అధ్యక్షుడు, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. మినరల్స్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ నిపుణుల మధ్య సహకారాన్ని పెంచడంతో సత్ఫలితాలు సాధించామని, పరిశోధనలకు బాట వేశామని చెప్పారు. ఐఆర్‌ఎస్ చైర్మన్, ఎండీ (ఫైనాన్స్) ఎన్.బలరామ్, ఐఐఎం చీఫ్ ఎడిటర్ కే భానుశంకరరావు, ఏఆర్‌సీఐ డైరెక్టర్ నరసింగరావు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్ కోమల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు వివిధ సంస్థలు తమ పరిశోధన ఫలితాలను స్టాళ్లలో ప్రదర్శించాయి. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో స్వదేశీ సాంకేతికతో టైటానియం మిశ్రధాతువును అబివృద్ధి చేస్తున్నామని హైదరాబాద్ మిధాని శాస్త్రవేత్తలు తెలిపారు. క్షిపణలు, రాకెట్లకు అవసరమై సామగ్రి తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. భూగర్భంలో నుంచి వెలికితీసిన ఖనిజాల నాణ్యతను మూడు దశల్లో పరీక్షించడానికి ఆధునిక పరికరాలను రూపొందించినట్లు చెన్నై మెట్‌కో సంస్థ వెల్లడించింది. 5 వేల సంవత్సరాల కిత్రమే తంగేడు, పులాయి ఆకులను దంచి మట్టికుండలో ఉంచి ఇనుమును గట్టిపరిచే కర్బనాన్ని అభివృద్ధి చేశారని, ఈ పద్ధతిలోనే మన పూర్వీకులు కోటలు నిర్మించారని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఖనిజ పరిశోధకుడు జయకిషన్ తెలిపారు. రాళ్లను సులువుగా తొలిచే యంత్ర పరికరాలను సాయిదీప రాక్ డ్రిల్లింగ్‌సంస్థ ప్రదర్శించింది.