Share News

GHMC: 300 వార్డులుగా జీహెచ్‌ఎంసీ

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:29 AM

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ టీ క్యూర్‌ వరకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని 300 వార్డులుగా పునర్‌ నిర్ధారించారు. 2 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి.....

GHMC: 300 వార్డులుగా జీహెచ్‌ఎంసీ

  • వార్డుల పునర్‌ నిర్ధారణకు సర్కారు ఆమోదం.. ఉత్తర్వులు జారీ

  • అభ్యంతరాలు స్వీకరించనున్న కమిషనర్‌.. నేడో, రేపో నోటిఫికేషన్‌?

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌(టీ-క్యూర్‌) వరకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని 300 వార్డులుగా పునర్‌ నిర్ధారించారు. 2 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి వార్డుల(డివిజన్‌) హద్దులను పునర్‌ నిర్ధారిస్తూ(రీ ఫిక్సేషన్‌), కార్పొరేటర్ల సంఖ్యను తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం మెట్రోపాలిటన్‌ ఏరియా అర్బన్‌ డెవల్‌పమెంట్‌ విభాగం ఉత్తర్వులు(జీవో 266) విడుదల చేశారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)తో కలిసి జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్‌ వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం చేసింది. అనంతరం బల్దియా కమిషనర్‌ సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం 300 వార్డులను నోటిఫై చేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల, ఆవల ఉన్న 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ గత బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీ-క్యూర్‌ వరకు జీహెచ్‌ఎంసీ పునర్విభజనపై అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. 300 వార్డుల ఏర్పాటుతో వార్డుకు ఒకరు చొప్పున 300 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కానున్నారు. మొన్నటి వరకు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్‌ఎంసీలో 150 వార్డులు, 30 సర్కిళ్లు, ఆరు జోన్లు ఉండేవి. విస్తరించిన జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య 300కు పెరిగింది. 10 వరకు జోన్లు, 50 వరకు సర్కిళ్లు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సర్కారు ఉత్తర్వుల నేపథ్యంలో పునర్విభజనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి మంగళ లేదా బుధవారాల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - Dec 09 , 2025 | 03:29 AM