Share News

GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ!

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:45 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ త్వరలో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లుగా మారబోతోందా? ప్రస్తుతమున్న హైదరాబాద్‌...

GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ!

  • పాలనా సౌలభ్యం కోసమేనంటున్న అధికార వర్గాలు

  • మార్చిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి): ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)’ త్వరలో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లుగా మారబోతోందా? ప్రస్తుతమున్న హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల తరహాలో, వాటికి సమాంతరంగా ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. 27 మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల విలీనంతో అతి భారీగా నగరంగా మారుతుండటంతో.. పాలనా సౌలభ్యం కోసం కోర్‌ అర్బన్‌ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అంటున్నాయి. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పరిధితో హైదరాబాద్‌ కార్పొరేషన్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సమాంతరంగా మిగతా రెండు కార్పొరేషన్లు ఉండే అవకాశం ఉందని.. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు. ఆయా కార్పొరేషన్ల్ల పరిధిలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా డివిజన్ల ఏర్పాటు, సరిహద్దులను నిర్ధారించడంపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.

పకడ్బందీ పర్యవేక్షణకు వీలుగా..

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి 650 చ.కి.మీ వరకు ఉంది. 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్‌ఎంసీ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌)లోకి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి సుమారు 1,085 చ.కి.మీ., రంగారెడ్డి జిల్లా నుంచి 700 చ.కి.మీ., సంగారెడ్డి నుంచి 300 చ.కి.మీ ప్రాంతం చేరే అవకాశం ఉందని పురపాలక శాఖ అంచనా వేసింది. మొత్తం విస్తీర్ణం 2,700 చదరపు కిలోమీటర్లకుపైగా, జనాభా 2 కోట్లకు పైగా ఉండనుంది. దీనితో పాలనాపరమైన నిర్ణయాల అమలు, పర్యవేక్షణ పెద్ద సవాలుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అన్ని ప్రాంతాలను కమిషనర్‌ పర్య వేక్షణ చేయలేని పరిస్థితి ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో మూడు కార్పొరేషన్ల్ల ఏర్పాటుకు కసరత్తు జరుగు తోందని.. దీనికి సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ అంతా మార్చి నాటికి ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక వర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో కోర్‌ అర్బన్‌పై విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ చట్టం, పురపాలక చట్టాలను సవరించే బదులు ‘ఒకే చట్టం.. ఒకే రాష్ట్రం’ ప్రాతిపదికన కోర్‌ అర్బన్‌ పరిధిలో పురపాలక చట్టాన్ని అమలు చేస్తే గందరగోళానికి తావు ఉండదని, సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది.


దేశంలో హైదరాబాదే బాద్‌షా!

శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో హైదరాబాద్‌ దేశంలోని మెట్రో నగరాలకే ‘బాద్‌షా’గా అవతరించనుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్‌ బెంగళూరుతోపాటు చెన్నై, కోల్‌కతా తదితర మెట్రో నగరాలను వెనక్కి నెట్టి అగ్రభాగంలో నిలవనుంది. దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందనుంది. నిజానికి కొన్నేళ్లుగా హైదరాబాద్‌ నగరం నలుదిక్కులా శరవేగంతో విస్తరించింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీవన వ్యయం తక్కువగా ఉండటం, భాషా సమస్య లేకపోవడంతో విద్య, ఉద్యోగావకాశాలు, వ్యాపారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల వారు హైదరాబాద్‌లో స్థిరపడుతున్నారు. దానితో నగరం ఇప్పటికే ఔటర్‌ రింగు రోడ్డు దాటిపోయింది. ఇప్పటికే ఫార్మా రంగానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌.. ఐటీలోనూ బెంగళూరును మించి దూసుకుపోతోంది. బయోటెక్నాలజీ, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాల వృద్ధి వేగంగా సాగుతోంది. మొత్తంగా ఓవైపు చారిత్రాక నేపథ్యం, మరోవైపు అత్యాధునిక హైటెక్‌ నగరంగా విలసిల్లుతోంది.

Updated Date - Nov 26 , 2025 | 04:45 AM