N. Ramchander Rao: అశాస్త్రీయంగా జీహెచ్‌ఎంసీ విస్తరణ
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:32 AM
స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు...
స్థానిక సమస్యలపై పోరాడండి
కార్యకర్తలకు రాంచందర్‌రావు పిలుపు
హైదరాబాద్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు. ఆయా ప్రాంతాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం పన్నులు మాత్రం పెంచుతోందన్నారు. ‘మల్కాజ్‌గిరి ఇంతకుముందు మునిసిపాలిటీ. జీహెచ్‌ఎంసీలో ఆ ప్రాంతాన్ని విలీనం చేసిన తర్వాత జూబ్లీహిల్స్ కంటే ఎక్కువ పన్నులు కట్టాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నార’ని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నగర శివారు ప్రాంత నాయకులు, కార్యకర్తల సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. కలిసిమెలిసి పనిచేయడం నేర్చుకోవాలని, సమావేశాలకు ఒకరిని ఆహ్వానించాలని, మరొకరిని ఆహ్వానించవద్దని పంతాలకు పోతే పార్టీ సీరియ్‌సగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా, కొండగట్టు అంజన్న ఆలయ భూముల వివాదం పరిష్కార బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. రెవెన్యూ, అసిస్టెంట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఎండోమెంట్, అటవీ శాఖలు కలిసి భూముల హద్దులు, పరిమితులను స్పష్టంగా నోటిఫై చేయాలని ఆయన డిమాండ్ చేశారు.