TS High Court: జీహెచ్‌ఎంసీ ఆర్డినెన్స్‌లపై వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:13 AM
జీహెచ్‌ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్‌లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్‌లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విస్తరణ, సమీప పట్టణ స్థానిక సంస్థల విలీనం కోసం జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1న జారీచేసిన ఆర్డినెన్స్ 9, 10, 11లను సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. తుక్కుగూడ మునిసిపాలిటీకి చెంది న బరిగల రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మియాపూర్ ఎస్‌హెచ్‌వో కోర్టులో హాజరుకావాలి
చట్టప్రకారం దర్యాప్తు చేపట్టకుండా, కారణాలు వివరించకుండా ఓ కేసును ముగించిన మియాపూర్ పోలీసుస్టేషన్.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఎదుట స్వయంగా హాజరై కేసు వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. వైద్య విద్యార్థిని అయిన తమ కుమార్తెను వేరే మతానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా నిర్బందించాడని వైద్యులైన ఆ యువతి తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు పిల్లల తండ్రైన ఆ వ్యక్తితోనే తమ కుమార్తె ఉంటోందని ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదును పోలీసులు ముగించడంపై ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం.. ‘‘ఆధారాలు లేవు’’ అంటే ఏంటి ? అని ఎస్‌హెచ్‌వోను ప్రశ్నించింది. కేసును ఎందుకు ముగించారో వివరణ ఇవ్వడానికి ప్రత్యక్షంగా హాజరుకావాలని మియాపూర్ ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.