Tribal Funds Misused: గిరిజనుల సొమ్ము స్వాహా
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:30 AM
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సహకారం అందించాల్సిన రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ టీజీ జీసీసీ అక్రమాలు, అవినీతికి నిలయంగా మారింది. గిరిజనుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు గిరిజన ఫిల్లింగ్ స్టేషన్లు అక్రమార్కుల పాలిట కామధేనువులయ్యాయి.....
జీసీసీ పెట్రోల్ బంకుల్లో రూ.కోట్లు మాయం.. ఉన్నతాధికారుల అండతో సిబ్బంది చేతివాటం
ఆడిట్‌లో తేడాలున్నా.. చర్యలు శూన్యం
ఆయిల్ కంపెనీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో పెట్రోల్ బంకుల మూత
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సహకారం అందించాల్సిన రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్(టీజీ జీసీసీ) అక్రమాలు, అవినీతికి నిలయంగా మారింది. గిరిజనుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు(గిరిజన ఫిల్లింగ్ స్టేషన్లు) అక్రమార్కుల పాలిట కామధేనువులయ్యాయి. కంచె చేను మేసిన చందంగా.. బంకుల నిర్వాహకులే అవినీతికి పాల్పడుతున్నారు. నిధులు దుర్వినియోగమైనట్లు ఆడిట్ నివేదికల్లో తేటతెల్లమైనా.. చర్యలు, రికవరీ లేకపోవడం వల్ల నిత్యం ఏదో ఒక చోట డబ్బులు కాజేస్తున్న ఉదంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో జీసీసీ పరిధిలో జరిగిన అక్రమాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా ఉన్నతస్థాయి అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉట్నూర్, భద్రాచలం, ఏటూరునాగారం డివిజన్ల పరిధిలోని 31 పెట్రోల్ బంకులను జీసీసీ నిర్వహిస్తోంది. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడం, వచ్చే లాభాలతో వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలనేదే లక్ష్యం. ఏటా దాదాపు రూ.200 కోట్లకుపైగా వ్యాపారం నడుస్తోంది. అయితే, బంకులు నిర్వహించే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడటంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. వచ్చే డబ్బులను కాజేస్తూ.. పెట్రోల్, డీజిల్ ఎక్కువగా ఆవిరవుతుందనే సాకు చూపుతూ, నష్టాలొస్తున్నాయని కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో నర్సంపేట, ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ప్రాంతాల్లోని కొన్ని బంకులు మూతపడ్డాయి.
చోద్యం చూస్తున్న జీసీసీ..
ఫ పాల్వంచ బ్రాంచ్ జీసీసీ పరిధిలో పనిచేసిన ఓ సేల్స్‌మన్ విషయంలో జరిగిన వ్యవహారం జీసీసీ లోపాలను కళ్లకు కట్టింది. 2021-22లో జీసీసీ ఆడిట్ నివేదిక ప్రకారం.. అక్కడి సేల్స్‌మన్ రూ.45,32,591 అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో గోడౌన్ సరుకుల నిధులు రూ.20,70.504, ములకలపల్లి జీసీసీ బంకు నిధులు రూ.24,62,086 కాజేసినట్లు ఆడిట్ నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై నోటీసులు ఇచ్చిన ఉన్నతాధికారులు.. దుర్వినియోగమైన సొమ్మును రాబట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ఫ ములకలపల్లిలోని జీసీసీ ఫిల్లింగ్ స్టేషన్‌లో జరిగిన అక్రమం.. సంస్థ నియమావళిని ఏ విధంగా ఉల్లంఘించారో తెలియజేస్తోంది. జీసీసీ నిబంధనల ప్రకారం బంకుల నిర్వహణ బాధ్యత(ఇన్‌చార్జ్) రెగ్యులర్ ఉద్యోగికి మాత్రమే ఇవ్వాలి. కానీ, జీసీసీలోని ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి బంక్ బాధ్యతలు అప్పగించారు. జీపీసీఎస్ పాల్వంచ మేనేజర్ 31.5.2023న జారీ చేసిన మెమో (ఆర్‌సి.నం..బి.91/2022) ప్రకారం.. ప్రేమ్ కుమార్ అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ములకలపల్లి బంకులో ఏకంగా రూ.72 లక్షలు కాజేసినట్లు తేలింది. ఆ సొమ్ము వెంటనే చెల్లించాలని నోటీసులిచ్చినా, నిధుల రికవరీపై జీసీసీ తీసుకున్న చర్యలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఈ తతంగంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలున్నాయి.
అక్రమాలు పునరావృతం..
జీసీసీ బంకుల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కఠిన చర్యలు లేకపోవడంతో పలు బంకుల్లో పదే పదే అవే అక్రమాలు జరుగుతున్నాయి. నిర్మల్ బంకు ఇన్‌చార్జ్ గతంలో దాదాపు రూ.15 లక్షలకుపైగా కాజేశారని స్పష్టమైంది. అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ రూ.9లక్షలకుపైగా దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఉట్నూరులో ఐటీడీఏ పీవో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనూరులోని పెట్రోల్ బంకు ఇన్‌చార్జ్ రూ.12 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. అయినా, ప్రస్తుతం ఆ బంకులో రూ.7లక్షలకుపైగా నిధులు దుర్వినియోగమవడం విశేషం. అదే జిల్లా తిర్యాణిలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జీసీసీ పరిధిలోని అనంతరెడ్డిపల్లి పెట్రోల్ బంకులోనూ రూ.10 లక్షలు దుర్వినియోగమైనా.. నోటీసులతో సరిపెట్టారనే ఆరోపణలున్నాయి. అయితే, రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని జీసీసీజీఎం సీతారాంనాయక్ తెలిపారు.