Ganesh Immersion: నిమజ్జనం సంపూర్ణం!
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:24 AM
వినాయక చవితి సందడి ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి వరకు 3,03,585 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి...
రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో గంగమ్మ ఒడికి 2.70 లక్షల విగ్రహాలు
పోలీసు, జీహెచ్‌ఎంసీ సహా వివిధ శాఖలకు సీఎం అభినందనలు
ఊరేగింపుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిపై కేసులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) :వినాయక చవితి సందడి ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి వరకు 3,03,585 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వైపునకు నగరంలోని ఇతర విగ్రహాలను అనుమతించారు. చంద్రగహణం నేపథ్యంలో ఆదివారం రాత్రి ఏడు గంటల్లోపే అన్ని చోట్ల నిమజ్జనాలు పూర్తి చేశారు. దిల్‌సుక్‌నగర్ కొత్తపేట పరిధిలోని సమతాపురి కాలనీలో ఏర్పాటు చేసిన 63 అడుగుల వినాయక విగ్రహాన్ని నిర్వాహకులు ఫైరింజన్ల సాయంతో అదే చోట నిమజ్జనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శోభాయాత్రలు సజావుగా సాగేందుకు కృషి చేసిన మునిసిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీ, ఇతర శాఖల సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులు, క్రేన్ ఆపరేట్లరకు అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు 40 గంటలపాటు కొనసాగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 40 అడుగులు కంటే ఎత్తున్న విగ్రహాల సంఖ్య పెరగడంతో ఈసారి శోభాయాత్ర కొంత ఆలస్యమైందన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే, ఊరేగింపుల్లో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పట్టుకున్నామని సీపీ వివరించారు.
టస్కర్ కిందపడి పారిశుధ్య కార్మికురాలి మరణం
ఆదివారం ఉదయం హైదరాబాద్, బషీర్‌బాగ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలు రేణుక(50) రోడ్డు దాటే క్రమంలో టస్కర్ కింద పడి మరణించారు. కాగా, శనివారం రాత్రి సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి లారీపై తరలిస్తున్న భారీ వినాయక విగ్రహం దిల్‌సుఖ్‌నగర్ చౌర స్తా వద్ద పక్కన వెళుతున్న కారు బానెట్‌పై పడింది.
శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ కానిస్టేబుల్ మృతి
గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుకు గురై మల్కాజిగిరికి చెందిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ కే.డేవిడ్(31) ప్రాణాలు కోల్పోయారు. ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న డేవిడ్ విధులు ముగించుకున్న తర్వాత.. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. డేవిడ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. డేవిడ్‌కి భార్య మూడు నెలల కుమార్తె ఉన్నారు.