Rudranshu Mukherjee: గాంధీజీ ఆనాడే చెప్పారు!
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:19 AM
కాంగ్రెస్ నాయకులు తనను ఒక నిరుపయోగమైన వ్యక్తిగా ఉంచడానికి ప్రయత్నిస్తారంటూ.. మహాత్మాగాంధీ ...
తన ఫొటో గోడకు తగిలించి ఓ నిరుపయోగమైన వ్యక్తిగా ఉంచడానికి ప్రయత్నిస్తారని కమ్యూనిస్టు నేతలతో అన్నారు
అశోక వర్సిటీ చాన్స్‌లర్ రుద్రాన్షు ముఖర్జీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నాయకులు తనను ఒక నిరుపయోగమైన వ్యక్తిగా ఉంచడానికి ప్రయత్నిస్తారంటూ.. మహాత్మాగాంధీ తనను కలిసిన కమ్యూనిస్టు నాయకులకు చెప్పారని అశోక వర్సిటీ చాన్స్‌లర్ ఆచార్య రుద్రాన్షు ముఖర్జీ తెలిపారు. మహాత్మా గాంఽధీ జయంతి సందర్భంగా శుక్రవారం మాదాపూర్‌లోని శిల్ప కళావివేదికలో మంతన్ సంవాద్ 14వ సమావేశం జరిగింది. అందులో.. ‘ఠాగూర్-గాంధీ: ఎ లెగసీ ఆఫ్ పబ్లిక్ రీజనింగ్’ అనే అంశంపై రుద్రాంషు ముఖర్జీ కీలకోపన్యాసం చేశారు. క్రమశిక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజ నియమాల వంటి చాలా విషయాలలో రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినా, ఇద్దరూ పరస్పర గౌరవంతో మెలిగారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మహాత్మాగాంధీ హత్యకు రెండు వారాల ముందు ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషితో పాటు మరో ఇద్దరు నాయకులు బాపూజీని కలిసి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరగా.. ‘‘నేను ఇప్పుడు ఒక అప్రాధాన్యమైన వ్యక్తిని. త్వరలోనే నా ఫొటో గోడకు తగిలించి, పూలహారాలు, మంగళహారతులతో నన్ను ఒక నిరుపయోగమైన వ్యక్తిగా ఉంచడానికి ప్రయత్నిస్తారు’’ అని గాంధీజీ చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. రక్షణ రంగ విశ్లేషకుడు, ‘ఫోర్స్’ ఎడిటర్ ప్రవీణ్ సాహ్ని, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్జాల్వెస్, ‘ది వైర్’ సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖానుమా షేర్వానీ, ఆర్థికవేత్త ఆచార్య రతిన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.