Share News

Gandhi Hospital: కార్పొరేట్‌ ఆస్పత్రిలా గాంధీ

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:04 AM

పేద ల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్న గాంధీ ఆస్పత్రిని సరికొత్తగా తీర్చిదిద్దాలని సర్కారు భావిస్తోంది. ..

Gandhi Hospital: కార్పొరేట్‌ ఆస్పత్రిలా గాంధీ

  • కొత్త హంగులతో తీర్చిదిద్దేందుకు కసరత్తు.. శానిటేషన్‌ మొదలు సమూల ప్రక్షాళనే లక్ష్యం

  • రోగి డిశ్చార్జ్‌ అయ్యాక అభిప్రాయ సేకరణ.. దశలవారీగా అన్ని దవాఖానాల అభివృద్ధి

హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): పేద ల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్న గాంధీ ఆస్పత్రిని సరికొత్తగా తీర్చిదిద్దాలని సర్కారు భావిస్తోంది. కార్పొరేట్‌ తరహాలో దవాఖానాను మార్చేందుకు ప్రభు త్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రక్షాళనలో భాగం గా తొలుత సూపరింటెండెంట్‌ను మార్చింది. ప్రస్తుత సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజకుమారిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులందాయి. గాంధీ ఆస్పత్రి పాలనంతా గందరగోళంగా మారిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజకుమారిపై సర్కారు వేటు వేసింది. ఆమెను ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆమె స్థానంలో అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ ఎన్‌.వాణిని నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వస్తాయి.

ప్రైవేటు ఆస్పత్రిని తలపించేలా..

సర్కారీ దవాఖానాలు ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగా కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా గాంధీ ఆస్పత్రిని అలా మార్చబోతోంది. అందులో భాగంగా అక్కడి వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తొలుత రోగులకు ప్రాథమిక సమాచారం అందించేలా రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఓపీ కౌంటర్లు రోగులకు సౌకర్యంగా ఉండేలా రూపొందించబోతున్నారు. ప్రతి విభాగాన్ని ఆధునిక సౌకర్యాలుండేలా డిజైన్‌ చేయాలని నిర్ణయించారు. ఏ విభాగం ఎక్కడ ఉంది..? అక్కడికి ఎలా వెళ్లాలి..? అన్న సూచిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు రోగులు కూర్చునేందుకు కుర్చీలతో పాటు డిజిటల్‌ టికెట్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌తో పాటు వైద్య సిబ్బందికి వారి హోదాకు తగ్గట్లుగా ప్రత్యేక కలర్‌ ఉన్న యూనిఫాంలను ఇవ్వనున్నారు. ఇక సర్కారీ ఆస్పత్రులనగానే మురికిపట్టిన గోడలు.. గుట్కా, పాన్‌పరాక్‌లు ఉమ్మేసిన మూలలు కనిపిస్తాయి. నీళ్లు చెమ్మదిగి రంగులు పోయిన గోడలుంటాయి. అటువంటి వాతావరణానికి చెక్‌ పెట్టాలని సర్కారు భావిస్తోంది. కారిడార్లు శుభ్రంగా, కలర్‌ఫుల్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బెడ్‌ల మధ్య దూరాన్ని పెంచి రోగులకు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రోగులు డిశ్చార్జ్‌ అయ్యాక గాంధీ వైద్య సిబ్బంది అందించిన సేవలపై ఫోన్‌లో అభిప్రాయాన్ని సేకరిస్తారు. వాటి ఆధారంగా ఇంకేదైనా మార్చాల్సినవి ఉంటే సరిదిద్దుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. తొలుత గాంధీ ఆస్పత్రిని తీర్చిదిద్దిన తర్వాత దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 202 ఆస్పత్రులను ఇదే తరహాలో మార్చనున్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Sep 11 , 2025 | 05:04 AM