Demolitions violated: గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:21 AM
గచ్చిబౌలిలోని ఓ లే అవుట్‌లో రోడ్లు, ప్రజావసర స్థలాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. గచ్చిబౌలి ప్రధాన రహదారి పక్కన ఫర్టిలైజర్ ....
హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చర్యలు
గతంలోనే తొలగించినా మళ్లీ ఆక్రమణ!
కూల్చివేతలపై కోర్టు ధిక్కరణ పిటిషన్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ/గచ్చిబౌలి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : గచ్చిబౌలిలోని ఓ లే అవుట్‌లో రోడ్లు, ప్రజావసర స్థలాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. గచ్చిబౌలి ప్రధాన రహదారి పక్కన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన లే అవుట్ ఉంది. అందులోని పార్కులు, రహదారులను ఆక్రమిస్తూ పక్కనున్న సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు నిర్మాణాలు చేపట్టారని లే అవుట్‌లోని ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీధర్‌రావు ఆక్రమణలకు సంబంధించి గతంలోనే హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. పరిశీలించిన హైడ్రా అధికారులు.. లేఅవుట్ కబ్జా చేసి పలు నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించి తొలగించారని ప్లాట్ల యజమానులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయస్థానం వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం హైడ్రా బృందాలు రంగంలోకి దిగి లే అవుట్‌లోని ఏడుచోట్ల రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేశాయి. రోడ్ల హద్దులు నిర్ధారించి వాటిని పునరుద్ధరించారు. కాగా ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్‌ఫసీఐ) లేఅవుట్‌లో సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. కూల్చివేతలు చేపట్టరాదని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని.. సదరు పిటిషన్‌లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతున్నారని పేర్కొంటూ సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కూల్చివేతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. వాటిని అడ్డుకోవాలని పేర్కొంటూ సంఽధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎ. సత్యశ్రీ వాదిస్తూ.. జూన్ 6న ఇదే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. హైడ్రా తరఫున న్యాయవాది కౌటూరి పవన్ వాదిస్తూ.. ఈ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ హాజరవుతారని, ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.