Share News

CM Revanth Reddy: వంతారా స్థాయిలో కొత్త జూ పార్కు!

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:01 AM

జంతువులకు వంతరాలో ఉన్న సదుపాయాలన్నీ ఫ్యూచర్‌ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసే జూ పార్కులో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు....

CM Revanth Reddy: వంతారా స్థాయిలో  కొత్త జూ పార్కు!

  • అక్కడున్న సదుపాయాలన్నీ ఇక్కడా ఉండాలి.. నెలాఖరులో వంతారాను సందర్శిస్తా: సీఎం రేవంత్‌

  • ఫ్యూచర్‌సిటీలో జూపార్కుపై వంతారాతో ఒప్పందం

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జంతువులకు వంతరాలో ఉన్న సదుపాయాలన్నీ ఫ్యూచర్‌ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసే జూ పార్కులో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త జూ పార్కుకు సంబంధించి సీఎం సమక్షంలో అటవీ శాఖ, ముఖేశ్‌ అంబానీకి చెందిన ‘వంతారా’ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జంతువులకు సేవ అనే నినాదంతో వంతారా పనిచేస్తోందని, ఇది అభినందనీయమని అన్నారు. ఈ నెలాఖరులో తాను వంతారాను సందర్శిస్తానని చెప్పారు. ఫ్యూచర్‌సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా జూ ఏర్పాటు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వంతారాతో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా వంతారా నిర్వాహకులు కొత్త జూ రూపకల్పన, సాంకేతికత, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపై మార్గదర్శకత్వం అందించనున్నారు. వంతారా జూ ప్రపంచ స్థాయి జంతు సంరక్షణ, పునరావాస, శాస్త్రీయ నిర్వహణలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అక్కడ అమలు చేస్తున్న వివిధ నమూనాలను తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జూ కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కొత్త జూ దేశంలోనేగాక ఆసియాలో ఒక ప్రత్యేక ఆకర్షణ, అంతర్జాతీయ మోడల్‌ జూగా అభివృద్థి చెందే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

విన్‌ గ్రూప్‌ రూ.27 వేల కోట్లు

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తొలి రోజు వచ్చిన పెట్టుబడుల్లో విన్‌ గ్రూప్‌ సంస్థ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు వాహనాల పరికరాల తయారీ పరిశ్రమలకు సంబంధించి రూ.27 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అలాగే బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు.

అమరరాజా రూ.9 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో అమరరాజా కంపెనీ రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని కంపెనీ అధినేత గల్లా జయదేవ్‌ అన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘తెలంగాణలో రెండేళ్ల క్రితమే మా కంపెనీ కొంతమేర పెట్టుబడులు పెట్టింది. వచ్చే పదేళ్లలో 9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం. దాదాపు 6-7 వేల మందికి ఉపాధి లభిస్తుంది’ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ చాలా బాగుందన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 04:01 AM