Police Restructuring: ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్!
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:38 AM
గ్రేటర్ హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థ ముఖ చిత్రం మారనుంది. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతమున్న మూడు కమిషనరేట్లలో హైదరాబాద్ కమిషనరేట్ మరింతగా...
ఇకపై హైదరాబాద్‌లో నాలుగు పోలీసు కమిషనరేట్లు
మున్సిపాలిటీల విలీనం నేపథ్యంలో నిర్ణయం
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉన్నతాధికారులు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థ ముఖ చిత్రం మారనుంది. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతమున్న మూడు కమిషనరేట్లలో హైదరాబాద్ కమిషనరేట్ మరింతగా విస్తరించనుంది. మిగతా రెండు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కొన్ని ప్రాంతాలను అటూ, ఇటూ మార్చనున్నారు. కొత్తగా పోలీసు జోన్లు, డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. శివారు మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ నగర విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉందని.. మార్పులు చేర్పులు ఉండవచ్చని చెబుతున్నారు.
పోలీసు కమిషనరేట్లలో మార్పులపై ప్రతిపాదనలివీ..
కొత్తగా ఏర్పాటు చేసే ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లోకి ఫ్యూచర్ సిటీ ప్రాంతంతోపాటు ప్రస్తుతం రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో ఉన్న మహేశ్వరం జోన్, చేవెళ్ల, షాద్‌నగర్ డివిజన్లను చేర్చనున్నారు.
ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్, శంషాబాద్ మున్సిపల్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్‌లోకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో అమీన్‌పూర్, పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం ప్రాంతాలను సైబరాబాద్‌లో కలిపే ప్రతిపాదన ఉంది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోన్లు రానున్నాయి.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్ మొత్తాన్ని తీసేసి.. పోలీస్ జిల్లాగా మార్చి ఎస్పీ స్థాయి అధికారిని నియమించనున్నట్టు సమాచారం. ఇక నార్త్‌జోన్ పరిధిలోని తిరుమలగిరి నుంచి తుకారాంగేట్ ప్రాంతం వరకు, సైబరాబాద్ పరిధిలోని శామీర్‌పేట జీనోమ్ వ్యాలీని రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి చేర్చనున్నారు.
ఇక సౌత్, సౌత్‌వె్‌స్ట జోన్లను చార్మినార్, గోల్కొండ జోన్‌లుగా.. నార్త్‌జోన్‌ను సికింద్రాబాద్ జోన్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.