Share News

Neem Tree: మన వేపకు ఫంగస్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:18 AM

మొక్కలకు సోకే చీడపీడలకు విరుగుడుగా రైతులు వేప నూనెను వాడతారు! చర్మరోగాలను తగ్గించడానికి వేపాకును వాడడం అనూచానంగా వస్తున్న అలవాటు!! పర్యావరణ హితకారిణి...

Neem Tree: మన వేపకు ఫంగస్‌

  • కొమ్మలు, ఆకులు ఎండిపోయేలా చేస్తున్న ‘ఫొమోప్సిస్‌ అజాడిరాక్టే’

  • వర్షాకాలం తర్వాత విజృంభణ

  • రాష్ట్రంలో 80-90ు చెట్లకు సోకుతున్న ఈ ఫంగ్‌సపై ‘ఎఫ్‌సీఆర్‌ఐ’ అధ్యయనం

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మొక్కలకు సోకే చీడపీడలకు విరుగుడుగా రైతులు వేప నూనెను వాడతారు! చర్మరోగాలను తగ్గించడానికి వేపాకును వాడడం అనూచానంగా వస్తున్న అలవాటు!! పర్యావరణ హితకారిణి. ఔషధ వృక్షం అయిన వేప నుంచి రకరకాల మందులు, సబ్బులు తయారు చేస్తుంటారు. ఇలాంటి బహుళ ప్రయోజకారి అయిన వేపచెట్టునే మాడ్చేసే ఫంగస్‌.. ‘ఫోమోప్సిస్‌ అజాడిరక్టే’. ఈ ఫంగస్‌ కారణంగా వేపచెట్లు ఎండిపోతాయి. వేపాకులు పత్రహరితాన్ని కోల్పోయి.. కొమ్మలు, రెమ్మలు పూర్తిగా ఎండుబారి చెట్టంతా నిర్జీవంగా మారిపోతుంది. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఈ ఫంగస్‌ విస్తరించి, రాష్ట్రంలోని చెట్లన్నింటినీ ఆశిస్తుంది. దాదాపు 80-90 శాతం చెట్లకు ఈ ఫంగస్‌ వ్యాపిస్తుంది. అయితే... ఇది సంవత్సరంలో కొంతకాలం పాటే చెట్లకు సోకుతుందని, ఆ తర్వాత వేప చెట్లు మళ్లీ కోలుకుని పచ్చగా మారుతాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇది చెట్టుకు మాత్రమే సోకే ఫంగస్‌ వ్యాధి అని, దీని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభమవుతుందనగా వ్యాప్తి చెందుతుందని ములుగులోని ‘అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎ్‌ఫసీఆర్‌ఐ)’ డీన్‌ (ఐఎ్‌ఫఎస్‌) వి.కృష్ణ వివరించారు. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు చెట్లన్నీ పత్ర హరితాన్ని కోల్పోయి, పూర్తిగా ఎండిపోతాయని ఆయన వివరించారు. మళ్లీ మార్చి నెలకల్లా ఈ చెట్లన్నీ తిరిగి యథావిధిగా పచ్చదనాన్ని సంతరించుకుంటాయన్నారు. గతంలో ఈ వ్యాధి ఉత్తర భారతంలోని వేప చెట్లకు వచ్చేదని, ఇప్పుడు దక్షిణాదిలోని చెట్లకూ సోకుతోందని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోందన్నారు. వేప చెట్టులో ఉండే ఔషధగుణాల కారణంగా ఈ ఫంగ్‌సను జయించి మళ్లీ కొత్తచివుర్లు వేస్తుందని వివరించారు. ఇప్పటికే దీనిపై రకరకాల పరిశోధనలు కొనసాగాయని, మూడు దశల ‘ఫంగిసైడ్‌’ పిచికారి ప్రక్రియను ప్రకటించామని తెలిపారు.

ఎందుకిలా?

ఈ ఫంగస్‌ ఒక ప్రత్యేక సమయంలోనే ఎందుకు వ్యాపిస్తోంది, 80-90 శాతం చెట్లకే ఎందుకు సోకుతోంది? మిగతా చెట్లు దీనిని ఎలా తట్టుకుని పచ్చదనంగా నిలబడుతున్నాయి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దీని తీవ్రత ఎలా ఉంది? ..ఇలా అనేక కోణాల్లో దీనిపై పరిశోధనలు చేస్తున్నామని ఎఫ్‌సీఆర్‌ఐ డీన్‌ వి.కృష్ణ తెలిపారు. ప్లాంట్‌ ప్యాథాలజీ నిపుణుడు, తమ సంస్థలోని అటవీ పరిశోధనల నిర్వహణ విభాగాధిపతి డా.జగదీశ్‌ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక, లోతైన పరిశోధనలు చేపట్టినట్టు ఆయన వివరించారు.

Updated Date - Dec 23 , 2025 | 04:18 AM