Frustrated Farmer Attempts Suicide: అధికారుల చుట్టూ తిరిగేకన్నా.. నాకు చావే మేలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:16 AM
రైతుగా పుట్టి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగడం కన్నా.. చావే మేలు. రైతునైన నాకు అడుగడుగునా కష్టాలే. దేశానికి రైతే వెన్నెముక అంటారు...
జిల్లా కలెక్టర్ ఆదేశించినా సమస్య పరిష్కారం కాలేదు
వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన గేటుకు ఉరేసుకునేందుకు యువ రైతు యత్నం
వికారాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘రైతుగా పుట్టి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగడం కన్నా.. చావే మేలు. రైతునైన నాకు అడుగడుగునా కష్టాలే. దేశానికి రైతే వెన్నెముక అంటారు. కానీ ఆ రైతు కష్టాలను ఎవరూ లెక్కచేయరు, పట్టించుకోరు.’’ అని ఓ యువ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. తన సమస్య పరిష్కారం కావడం లేదని వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఉరేసుకునేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తన చావుకు కొడంగల్ ఎఫ్‌ఆర్వో, డీఎ్‌ఫవోలే కారణని పేర్కొంటూ బాధితుడు లేఖ రాశాడు. తన 24 గుంటల భూమిని సర్వే చేసి ఇవ్వాలని అటవీ అధికారుల చుట్టూ తిరుగుతున్నానని కొడంగల్ నియోజకవర్గం చిట్లపల్లికి చెందిన శ్రీనివాస్ తెలిపాడు. ఏడాదిన్నరగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని చెప్పాడు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించినా సమస్యను పరిష్కరించడం లేదని వాపోయాడు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోనే తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డు ఉందని, అటవీ శాఖ నుంచే ఇబ్బంది ఉందన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయాని, ఇప్పటి వరకు 11 సార్లు కలెక్టరేట్‌కు వచ్చానని పేర్కొన్నారు. తన వద్ద చార్జీలకు డబ్బులేక అప్పు చేసి వస్తున్నానని శ్రీనివాస్ వాపోయాడు.