సంతల నుంచి కబేళాలకు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:37 AM
సంతలే కేంద్రాలుగా పశువులు కబేళాలకు తరలుతున్నాయి.
సంతలే కేంద్రాలుగా పశువులు కబేళాలకు తరలుతున్నాయి. గో సంరక్షణకు చట్టాలు ఉన్నా సరిగా అమలు కాకపోవడంతో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. గోవులను వధించే చర్యలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభు త్వం తెచ్చిన గో సంరక్షణ చట్టంపై జంతు ప్రియులు హర్షం వ్యక్తం చేశారు. అయినా గుట్టు చప్పుడు కాకుండా పశువుల అక్రమ రవాణా కొనసాగుతోంది. పోలీసులు, అధికారుల నిఘా కొరవడడంతో యధేచ్ఛగా కబేళాలకు తరలుతున్నాయి.
- (ఆంధ్రజ్యోతి, బీబీనగర్)
యాదాద్రిభువనగిరి జిల్లాలో పశువుల అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతునే ఉంది. సంతల నుంచి పశువులను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. ఒకే వాహనంలో మోతాదుకు మించి పశువులను కుక్కి రవాణా చేస్తున్నారు. కిలో మీటర్ల కొద్దీ తరలిస్తున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా అందించడం లేదు. గోవులను, పశువులను తరలిస్తున్న వాహనాలపై గో సంరక్షణ నాయకులు నిఘా పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. పశువులు రవాణా చేసే వాహనాలను పోలీసులు పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు. లేదంటే నామమాత్రంగా కేసులు పెట్టి వదిలివేయడం పరిపాటిగా మారింది. సంతకు తీసుకొచ్చే పశువుల్లో అధికంగా కబేళాలకు తరలిస్తున్నారు. ఈ దారుణంపై జంతు ప్రేమికులు, గో సంరక్షణ సంఘాల నేతలు నిత్యం పోరాడుతునే ఉన్నారు.
రక్షణ కల్పించలేకపోతున్న చట్టం
గోవధను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఫ్రివెన్స్ ఆఫ్ క్రూఎల్లి టూ యానిమల్ (రెగ్యులేషన్ ఆఫ్ లైఫ్ స్టార్ మార్కెట్) రూల్స్ 2017 జూన్ 7వ తేదీన సవరణ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం గేదెలు, ఆవులు, కోడే దూడలు, ఎద్దులు లాంటివి వధించడానికి వీలు లేదు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. ఈ చట్టం ప్రకారం పశువులను ఎక్కడపడితే అక్కడ విక్రయించడానికి వీలు లేదు. పశువుల సంతలు ఏర్పాటు చేయాలన్న మార్కెట్ కమిటీల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పశుక్రయ విక్రయాల బాధ్యతలను మార్కెట్ కమిటీలకు అప్పగించింది. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా నుంచి ఏదో ఒక రూపంలో పశువులు, ఆవులు, వాహనా లలో కబేళాలకు తరలిపోతున్నాయి. ఒత్తిడి పెంచినప్పుడు మాత్రమే పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఒకటో, రెండో గోవులు, పశువుల తరలింపు వాహనాలను పట్టుకుంటున్నారు. వీటిపై పోలీసులు నిఘా పెట్టాల్సి ఉంది.
నిబంధనలు కఠినతరం
యాదాద్రిభువనగిరి జిల్లాలో ప్రధానంగా బీబీనగర్ మండలం కొండమడుగు, యాదగిరిగుట్ట, రామన్నపేట, చౌటుప్పల్, నల్లగొండ జి ల్లా నార్కట్‌పల్లి తదితర పట్టణాల్లో వారంత పు పశువుల సంతలు ఉన్నాయి. వీటిలో వారానికి కోట్ల రూపాయల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో అధిక శాతం పశు సంపద కబేళాలకు తరలిపోతుంది. సంతలో పశువులను వ్యవసాయ దారులకు మాత్రమే విక్రయించాలనే నిబంధన అమలులోకి తెచ్చిం ది.పశువులను కొనుగోలు చేసే వారు, విక్రయి ంచే వారు తమ వివరాలను మార్కెట్ కమిటీల వద్ద పొందుపర చడంతో పాటు హామీ పత్రాలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
వ్యవసాయ అవసరాలకు క్రయ, విక్రయాలు జరిపితే అభ్యంతరం లేదు
వ్యవసాయ పనుల అవసరాల నిమిత్తం పశువులను కొనుగోలు చేయవచ్చు. అందుకు ఎటువంటిఅభ్యంతరాలు లే వు. సాధారనంగా అయి తే తొలకరి జల్లులు పడే జూన్ మాసంలో వ్యవసాయ పనుల కోసం సంతలో ఎద్దులు, దూడలు కొనుగోలు చేసుకోవచ్చు. పనులు ముగిసిన 6నెలల తర్వాత పశువులను సంతలో విక్రయించుకోవచ్చు. వ్యవసాయానికి ఉపయోగపడే, 14సంవత్సరాల లోపు వయసు ఉన్న పశువులను కబేళాలకు తరలించడానికి వీలు లేదు.
- ఉషా పశువైద్యాధికారి బీబీనగర్