Freezing Cold Grips: రాష్ట్రం గజగజ!
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:24 AM
రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ఉదయం పూట ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయమేసేలా చలి విజృంభిస్తోంది..
ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3, 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ఉదయం పూట ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయమేసేలా చలి విజృంభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 దాటితే బయట జన సంచారమే కనిపించడం లేదు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు కప్పేస్తోంది. బుధవారం రాత్రి అతి తక్కువగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 4.7 డిగ్రీలు తక్కువ కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే మూడు, నాలుగు డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని.. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 2, 3 డిగ్రీల మేర తగ్గుతాయని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఇక సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో హన్మకొండ జిల్లా టాప్‌లో ఉంది. ఈ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత సగటున 14 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోలిస్తే ఇది 5.5 డిగ్రీలు తక్కువ. ఇక మెదక్‌లో సాధారణంతో పోలిస్తే 4.5 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల మేర.. హైదరాబాద్‌లో 3.5 డిగ్రీలు తక్కువగా 14.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.