GroundnutSeeds: వేరుశనగ రైతులకు ఉచిత విత్తనాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:19 AM
వేరుశనగ రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాల పంపిణీపై ప్రభుత్వం దృష్టిసారించింది. వంద శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది...
అధిక దిగుబడినిచ్చే 3 వంగడాల ఎంపిక.. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎఫ్‌పీవోలకు
8 జిల్లాల్లో 45 వేల ఎకరాలకు విత్తనాలు
లేపాక్షి, గిర్నార్- 5, జీజేజీ- 32 పంపిణీ
నేడు ‘రైతునేస్తం’లో పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాల పంపిణీపై ప్రభుత్వం దృష్టిసారించింది. వంద శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు రాష్ట్రంలో 8 జిల్లాలను ఎంపిక చేయగా... మంగళవారం నిర్వహించే ‘రైతునేస్తం’ కార్యక్రమంలో విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. 45 వేల ఎకరాలకు సరిపడా 38 వేల క్వింటాళ్ల మేర లేపాక్షి, గిర్నార్- 5, జీజేజీ- 32 వేరుశనగ వంగడాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, రైతులను ఎంపిక చేసే బాధ్యత రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో)కు అప్పగించింది. జాతీయ తినదగిన నూనె గింజల అభివృద్ధి మిషన్ (నేషనల్ మిషన్ ఆన్ ఇడబుల్ ఆయిల్స్) పథకాన్ని... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్న విషయం విదితమే. పామాయిల్, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆవాలు... తదితర తినదగిన నూనె గింజల ఉత్పత్తి పెంచేందుకు కృషిచేస్తోంది. అయితే ఈ నూనె గింజల్లో కూడా... అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రభుత్వం ఎంచుకొంది. కాగా ఈ పథకంలో పంపిణీచేసే వేరుశనగ విత్తనాల్లో... సంప్రదాయ విత్తనాలు కాకుండా ఇటీవలే ఉత్పత్తిచేసిన వెరైటీలను ఎంపికచేశారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేసిన ‘గిర్నార్- 5’, ఏపీలోని అనంతపురం జిల్లాలో ‘డ్రైలాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్’ (డార్స్) శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేసిన ‘కదిరి లేపాక్షి’, గుజరాత్‌లోని జునాగడ్ వ్యవసాయ వర్సిటీ ఉత్పత్తి చేసిన జీజేజీ- 32 విత్తనాలను... రైతులకు సరఫరా చేయాలని నిర్ణయించారు.
యాసంగికి 38 వేల క్వింటాళ్లు
ఈ యాసంగి(2025- 26) సీజన్‌కు గాను రైతులకు పంపిణీ చేయటానికి ప్రభుత్వం 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలు 45,350 ఎకరాలకు సరిపోతాయి. వేరుశనగ ఎక్కువగా సాగుచేసే... మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలను ఈ పథకంలో ఎంపికచేశారు. కాగా, ఈవిత్తన సబ్సిడీకి ప్రభుత్వం రూ. 46.15 కోట్లు వెచ్చిస్తుండటం గమనార్హం.
50-60 శాతం అధిక దిగుబడి
సంప్రదాయ వేరుశనగ వంగడాలతో పోలిస్తే కదిరి లేపాక్షి, గిర్నాల్- 5, జీజేజీ- 32 వంగడాలు సాగుచేస్తే 50 శాతం నుంచి 60 శాతం అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నూనెలో కూడా 80 శాతం ఓలియోక్ ఆమ్లం ఉండటంతో ఎక్కువ రోజులు నిల్వచేసుకునే అవకాశం ఉంటుందని, మంచి ధర వస్తుందని తుమ్మల వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న జాతీయ నూనెగింజల పథకంలో ఈఏడాది రూ. 67 కోట్లు ఖర్చుచేసి నూనె గింజల విస్తీర్ణం పెంచుతున్నట్లు తెలిపారు.
- తుమ్మల నాగేశ్వరరావు,
వ్యవసాయశాఖ మంత్రి