Share News

Contractor Corruption: కాంట్రాక్టర్ల జేబుల్లోకే చేప పిల్లలు

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:14 AM

రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కాంట్రాక్టర్లకు కాసుల పంట పండిస్తోంది..

Contractor Corruption: కాంట్రాక్టర్ల జేబుల్లోకే  చేప పిల్లలు

  • ఉచిత చేప పిల్లల పంపిణీలో గోల్‌మాల్‌

  • టెండరు దశలోనే కాంట్రాక్టర్ల కూటమి

  • నిధుల్లో సగం వృధా అవుతున్నాయంటున్న మత్స్యకారులు

  • సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేప పిల్లలు కొనుక్కుంటామని విజ్ఞప్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కాంట్రాక్టర్లకు కాసుల పంట పండిస్తోంది. టెండర్ల దశ నుంచి మొదలు చెరువుల్లో చేప పిల్లలను వేసే వరకు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా ప్రభుత్వం రూ. వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తుంటే.. అందులో సగం దోపిడీకి గురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ పథకంతో మత్స్యకారుల కంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభం జరుగుతోందని.. చేపపిల్లల పంపిణీకి బదులు తమకు నగదు బదిలీ చేస్తే, నాణ్యమైన చేపపిల్లలు కొనుక్కుంటామని మత్స్యకార సొసైటీలు కోరుతున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిబంధనలు మారుస్తుందని, నగదు బదిలీ చేస్తుందని చర్చ జరిగింది. కానీ పాత పద్ధతిలోనే చేప పిల్లల పంపిణీ కొనసాగించేలా కొందరు బడా కాం ట్రాక్టర్లు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 2016-17లో ప్రారంభమైంది. కాంట్రాక్టర్లు నాణ్యత లేని చేపపిల్లలు సరఫరా చేయడం, అదీ నిర్ణీత పరిమాణం కంటే తక్కువగా చెరువుల్లో వేయడం, అందులోనూ చనిపోయిన చేప పిల్లలు ఉండటం వంటి అక్రమాలు ఏటా జరుగుతూనే ఉన్నాయని మత్స్యకార సొసైటీలు చెబుతున్నాయి. తామే కొంత సొమ్ము పోగేసుకొని, నాణ్యమైన చేపపిల్లలు కొని, చెరువుల్లో వేసుకుంటున్నామని అంటున్నాయి.

నగదు బదిలీకి ప్రతిపాదన వచ్చినా..

రాష్ట్రవ్యాప్తంగా 6,152 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 4.25 లక్షల మంది మత్స్యకారులు స భ్యులుగా ఉన్నారు. వారికి ఉపాధి కోసం ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. చెరువుల విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ‘రైతుభరోసా’ పథకం తరహాలో మత్స్యకారుల సొసైటీలకు ‘చేపపిల్లల పథకం’ నగదు బదిలీ చేయాలని ఈ ఏడాదీ ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చింది. కానీ చేపపిల్లల పంపిణీలో ఉన్న కాంట్రాక్టర్లు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి నగదు బదిలీ ప్రతిపాదనను బుట్టదాఖలు చేయించినట్టు తెలిసింది. ఈ సారి చేపపిల్లల సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వం రూ.122.22 కోట్లు కేటాయించింది. మత్స్యశాఖ జిల్లాల వారీగా ఈ-టెండర్లు పిలిచింది. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి గడువు ముగియగా 10 జిల్లాల్లో ఒక్కో టెండర్‌ మాత్రమే వచ్చింది. కాం ట్రాక్టర్లు కూటమికట్టి జిల్లాలను పంచుకుని, ఒక్కో టెండర్‌ మాత్రమే వేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరో 16 జి ల్లాల్లో ఒక్క బిడ్‌ కూడా దాఖలవకపోవడంతో అధికారులు ఈనెల 8వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయితే ఒక్క టెండర్‌ మాత్రమే దాఖలైన జిల్లాల్లో.. వారికే కాం ట్రాక్టు అప్పగిస్తారా? మళ్లీ టెండర్లు పిలుస్తారా? చూడాలి.

Updated Date - Sep 08 , 2025 | 03:14 AM