Share News

Free and Paid Medical Services: ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌లలో ఉచిత, చెల్లింపు వైద్యసేవలు!

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:57 AM

రాజధాని హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, రీసెర్చ్‌ టిమ్స్‌ ల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు...

Free and Paid Medical Services: ఎల్బీనగర్‌,  అల్వాల్‌  టిమ్స్‌లలో ఉచిత, చెల్లింపు వైద్యసేవలు!

  • పేదలకు ప్రత్యేకంగా 350 పడకలు.. కావాలనుకుంటే చెల్లింపు వైద్య సేవలు.. వారికి 650 పడకలు ఉండేలా ప్రణాళిక

  • సనత్‌నగర్‌లో నిమ్స్‌ తరహా సేవలు

  • ‘ఉచితం’ స్థానంలో ఆరోగ్య శ్రీ వైద్యం

౅హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, రీసెర్చ్‌(టిమ్స్‌)ల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌లలో ఉచిత, చెల్లింపు వైద్య సేవలు అందించేలా, సనత్‌నగర్‌ టిమ్స్‌లో నిమ్స్‌ తరహాలో సేవలు అందించేలా వైద్య శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌లలో పేదలకు ఉచిత వైద్యం అందించడంతోపాటు స్తోమత ఉన్న వారు డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందే వెసులుబాటు కల్పించనున్నారు. సనత్‌ నగర్‌ మినహా మిగిలిన రెండు చోట్లా మెడికల్‌ కాలేజీల కోసం 350 పడకలు కేటాయించనున్నారు. వీటిలో ప్రజలకు ఉచిత వైద్య సేవలందించనున్నారు. మిగిలిన 650 పడకల్లో చెల్లింపు సేవలు అందించనున్నారు. ఇక, సనత్‌నగర్‌ టిమ్స్‌లో మాత్రం చెల్లింపు వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ, నిమ్స్‌ తరహాలో ఆరోగ్య శ్రీ కింద రోగులను చేర్చుకుని, సేవలందిస్తారు. హైదరాబాద్‌ చుట్టూ మూడు టిమ్స్‌లతోపాటు వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం సూపర్‌ స్పెషాలిటీ హస్పిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఎ్‌సఎ్‌సహెచ్‌సీఎల్‌)ను ఏర్పాటు చేసింది. తొలుత హన్మకొండలోని 56 ఎకరాలను(వరంగల్‌ జైలు స్థలాన్ని) తాకట్టు పెట్టి బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి రూ.1173 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఆ తర్వాత రూ.10వేల కోట్ల రుణానికి ప్రతిపాదనలు పెట్టగా, ఎస్బీఐ కన్సార్టియం దశల వారీగా మరో రూ.4800 కోట్లు రుణం ఇచ్చింది. ఇందుకోసం నిమ్స్‌తో పాటు సనత్‌ నగర్‌, కొత్తపేట, అల్వాల్‌ టిమ్స్‌ భూములను గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది. పేషెంట్‌ కేర్‌ ద్వారా వచ్చే డబ్బులతో రుణాలు చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగానే చెల్లింపు వైద్య సేవల విధానాన్ని అమలు చేయాల్సి వస్తోందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్బీనగర్‌ టిమ్స్‌ను మహేశ్వరం మెడికల్‌ కాలేజీ, అల్వాల్‌ టిమ్స్‌ను కుత్బుల్లాపూర్‌ వైద్య కళాశాల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఆయా ఆస్పత్రుల్లో చెల్లింపు సేవలతోపాటు ఉచిత సేవలు అందనున్నాయి.


వేర్వేరుగా ఏర్పాట్లు

ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌ల్లోకి అడుగుపెట్టగానే ఎడమవైపు ఉచిత వైద్య సేవలు, కుడివైపు చెల్లింపు సేవలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డబ్బులు చెల్లించి వైద్యం పొందాలనుకునే వారినే చెల్లింపు సేవల విభాగంలోకి అనుమతిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు టిమ్స్‌లోని పై అంతస్థుల్లో లగ్జరీ రూమ్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. చెల్లింపు, ఉచిత సేవలు అందించే సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది కూడా వేర్వేరుగానే ఉంటారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. సెల్ఫ్‌ మనీ జనరేటెడ్‌ విధానం అమలు చేయడం ద్వారా సర్కారుపైనా భారం తగ్గుతుందని పేర్కొంటున్నాయి. అదే సమయంలో కార్పొరేషన్‌ పేరిట తీసుకున్న అప్పులను చెల్లించే వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నాయి. కాగా, అక్టోబరు చివరి నాటికి సనత్‌నగర్‌ టిమ్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగిస్తామని నిర్మాణ సంస్థలు వైద్యశాఖకు తెలిపాయి. డిసెంబరులో అక్కడ వైద్య సేవలు ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎల్‌ బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌లను నిర్మాణ సంస్థలు వైద్య శాఖకు అప్పగించనున్నాయి.

Updated Date - Sep 30 , 2025 | 04:57 AM