Loan Sharking: ఘరానా మోసగాడు బాలాజీ నాయక్ అరెస్టు
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:24 AM
అధిక వడ్డీల ఆశ చూపి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకుని మోసగించిన రమావత్ బాలాజీ నాయక్‌ని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు....
240% వరకు వడ్డీ ఇస్తానంటూ 50 కోట్లకు పైగా వసూలు
ప్రామిసరీ నోట్లు, లగ ్జరీ కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర
నల్లగొండ క్రైం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీల ఆశ చూపి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకుని మోసగించిన రమావత్ బాలాజీ నాయక్‌ని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.80 లక్షల విలువైన ఫార్చ్యూనర్, స్కార్పియో కార్లు, పలు ప్రదేశాల్లోని ఆస్తుల డాక్యుమెంట్లు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో డబ్బు దాచుకుంటే ఏడాదికి 8 శాతం వరకు వడ్డీ వస్తుందని, తాను 110 నుంచి 240 శాతం వరకు వడ్డీ ఇస్తానని బాలాజీ నాయక్ బాధితులను నమ్మించాడని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. ఇలా సుమారు రూ.50 కోట్ల పైచిలుకు వసూలు చేశాడని, అతనిపై గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో అందిన ఫిర్యాదుల మేరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పేర్కొన్నారు. శనివారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. ‘అప్పులిచ్చే వారిని నమ్మించేందుకు బాలాజీ నాయక్ తన విలాసవంతమైన కార్లలో ఎక్కించుకొని నల్లగొండలోని ఐటీ టవర్ వద్దకు తీసుకొచ్చి అది తన బంగ్లాయేనని చెప్పేవాడు. ఖరీదైన విల్లాలు, వెంచర్ల వద్దకు తీసుకెళ్లి అవి తన ఆస్తులేనని నమ్మబలికేవాడు. భారీ మొత్తంలో అప్పులు చేసి.. ఆ డబ్బును మద్యం వ్యాపారం, స్టాక్ మార్కెట్‌లో ఇంట్రాడే ట్రేడింగ్, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడ్డాడు. జల్సాలు, దావత్‌లు చేస్తూ జనాల్ని నమ్మించడం కోసం మరిన్ని అప్పులు చేశాడు. బాధితులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి డబ్బులివ్వనని అతను బెదిరించడంతో చాలామంది ముందుకురాలేద’ని ఎస్పీ తెలిపారు. బాలాజీ నాయక్‌కు అప్పులివ్వడంతో పాటు మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించిన సరియానాయక్.. తీవ్ర ఒత్తిడికి గురై మరణించడంతో పలువురు బాధితులు ధైర్యం చేసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వాటి ఆధారంగా తాము విచారణ చేసి బాలాజీ నాయక్‌ని అరెస్టు చేశామన్నారు. ‘ఒకవైపు ఏజెంట్ల ద్వారా, మరోవైపు నేరుగా కోట్లాది రూపాయలు అప్పులు తీసుకుని.. ప్రాంసరీ నోట్లు రాసి నెలనెలా వడ్డీలిస్తూ వచ్చాడు. ఈ డబ్బుతో అతనితో పాటు బంధువులు, స్నేహితులు, ఇతర బినామీల పేర్లపై వ్యవసాయ భూములు, ఇళ్లు, ఖరీదైన ప్లాట్లు, కార్లు, బైక్‌లు కొన్నాడు.
జల్సాలు చేశాడు. బాధితులకు వడ్డీలు ఇచ్చి, ఆ విషయాన్ని ప్రాంసరీ నోట్ల వెనక రాసేవాడు. వాటిని తీసుకుని కొత్త ప్రాంసరీ నోటు మీద అసలు అమౌంట్ రాసి ఇచ్చి నమ్మించేవాడ’ని ఎస్పీ తెలిపారు. 111 మద్యం దుకాణాలకు టెండర్లు వేయగా.. ఒక దుకాణం వచ్చిందని, ఆ తర్వాత సిండికేట్‌లో కలిసి మద్యం వ్యాపారం చేయగా రూ.2.30 కోట్లు నష్టపోయాడని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్‌లో ఇంట్రా ట్రేడింగ్ చేసి రూ.12.15 కోట్లు, ఆర్‌బీఎన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడని ఎస్పీ వివరించారు. బాధితులందరూ గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని తెలిపారు. బాలాజీ నాయక్ ఏజెంట్లు, బినామీలను సైతం గుర్తించి వారి ఆస్తులను కూడా అటాచ్ చేస్తామన్నారు. కాగా, అతని నుంచి మిర్యాలగూడ, హయత్‌నగర్, నేరేడుచర్ల, పలుగుతండాల్లోని ఇళ్లు, దామరచర్ల, వద్దిపట్లలోని వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు రాసిచ్చిన 36 ప్రాంసరీ నోట్లు, మరో 77 ఖాళీవి సేకరించారు. ఒక రిజిస్టర్ బుక్, అతని ఫోన్‌లో లావాదేవీలు రాసుకునే ఎక్సల్ షీట్‌ను గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నారు.