Tummala Nageswara Rao: పీఎం ధన ధాన్యలో 4 జిల్లాలకు చోటు
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:25 AM
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనలో రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఎంపిక చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు...
కేంద్ర నిర్ణయంపై మంత్రి తుమ్మల హర్షం
హైదరాబాద్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’లో రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఎంపిక చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కలిసి, ఈ పథకంలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి కృతజతలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్పాదకత పెంపు, పంటల మార్పిడి, నీటి పారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచేలా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ పథకం చరిత్రాత్మక మార్పు తెచ్చేదిగా పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 4 జిల్లాల్లో రూ.960 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్ల పాటు అమలు చేయబోతున్నారని చెప్పారు. ధన-ధాన్య కృషి యోజన.. 36 కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం అవుతుందన్నారు. కేవలం వర్షాధార, తక్కువ ఉత్పాదకత చూపుతున్న ప్రాంత రైతులకు లాభం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమంతో పాటు దేశవ్యాప్తంగా ఆహార భద్రత, ఉపాధి అవకాశాల పెంపునకు తోడ్పడుతుందన్నారు.