Flights Delayed: వివిధ విమానాల్లో ఒకేరోజు నలుగురు ప్రయాణికులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:50 AM
శంషాబాద్ విమానాశ్రయంలోని వివిధ విమానాల్లో ఒకేరోజు నలుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు.....
ఆస్పత్రికి తరలింపు, ఆలస్యంగా బయల్దేరిన విమానాలు
శంషాబాద్ రూరల్, నవంబర్ 24 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ విమానాశ్రయంలోని వివిధ విమానాల్లో ఒకేరోజు నలుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. సోమవారం రన్‌వేపై సిద్ధంగా ఉన్న రెండు విమానాల్లో ముగ్గురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు గుండెపోటుకు లోనయ్యారు. సోమవారం ఉదయం 148 మంది ప్రయాణికులతో రియాద్ వెళ్తున్న పైనాస్ ఎక్స్‌వై326 విమానం టేకాఫ్ తీసుకోవడానికి ట్యాక్సీవే పైకి వెళ్తుండగా పొచ్చ మల్లయ్య, మహ్మద్ అబ్దుల్ నబీ అస్వస్థతకు గురయ్యారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ వెళ్తున్న ఆకాశ్ ఎయిర్‌లైన్స్ క్యూపీ 1405 విమానంలో శ్రీనివా్‌సరెడ్డి (38) అనే ప్రయాణికుడికి విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఛాతిలో నొప్పి వచ్చింది. గమనించిన సిబ్బంది విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు తెలియజేసి, విమానాలను ప్లాట్‌ఫామ్‌పై నిలిపివేశారు. మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది అస్వస్థతకు గురైన ఇద్దరు ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ విమానాలు గంటకు పైగా ఆలస్యంగా బయల్దేరాయి. మరో ఘటనలో షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6ఈ 6063 విమానంలో అనియ విశాల్ సాల్వే అనే మహిళా ప్రయాణికురాలు గుండెపోటుకు గురయ్యారు. విమానం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు.
టేకా్‌ఫకు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరచిన ప్రయాణికుడు
విమానం టేకా్‌ఫకు ముందు ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తీయడానికి యత్నించాడు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆదివారం సాయంత్రం 5:10 గంటలకు కొచ్చిన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 2834 విమానంలో ఈ ఘటన జరిగింది. మహ్మద్ నవాజ్ అనే ప్రయాణికుడు మొదటిసారి విమానం ఎక్కడంతో పొరపాటున డోర్ తీసినట్లు తెలిసింది. తిరిగి 6:09 గంటలకు ఆ విమానం కొచ్చిన్‌కు బయల్దేరి వెళ్లింది.