Telangana Government Orders: నలుగురికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:07 AM
రెవెన్యూ శాఖలో నలుగురు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లకు అదనపు కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. అలాగే 13 మంది డిప్యూటీ కలెక్టర్లకు...
13 మందికి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లుగా.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో నలుగురు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లకు అదనపు కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. అలాగే 13 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈమేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పదోన్నతి పొందిన 13 మంది స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. భూభారతి చట్టంలో సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నలుగురికి అదనపు కలెక్టర్లుగా, 13 మందికి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది. ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్ అర్హులైన తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతులు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.