Ganja Smuggling: ఏసీ కోచ్‌లలో గంజాయి స్మగ్లింగ్!
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:50 AM
ఎవరికీ అనుమానం రాకుండా సరికొత్త ట్రాలీబ్యాగులతో ఏసీ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణి స్తూ.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు కొరియర్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ బృందాలు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.
ఒక్క పార్సిల్ డెలివరీ చేస్తే రూ.పది వేలు
రైల్వే పోలీసులు, ఈగల్ బృందాల ఆపరేషన్‌లో నలుగురు కొరియర్ల అరెస్టు
హైదరాబాద్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఎవరికీ అనుమానం రాకుండా సరికొత్త ట్రాలీబ్యాగులతో ఏసీ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణి స్తూ.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు కొరియర్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ బృందాలు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. ఇలా ఒడిశా నుంచి పుణెకు గంజాయిని సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ నలుగుర్ని అరెస్టు చేసి రూ.22 లక్షల విలువైన 91 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశాకు చెందిన ప్రకాష్ చంద్ర ప్రదాన్, బసంత్, ఘన్‌శ్యామ్, చిత్రసేన జనీలు గంజాయి స్మగ్లర్ ప్రశాంత్ వద్ద కొరియర్లుగా పనిచేస్తున్నారు. వీరు ఒక్కొక్కరికి పది నుంచి పదిహేను కిలోల గంజాయిని ప్రశాంత్ అందజేసేవాడు. దాన్ని మంచి ట్రాలీబ్యాగుల్లో, హ్యాండ్ బ్యాగ్‌లలో దాచుకుని వీరంతా ఏసీ కంపార్ట్‌మెంట్ టికెట్లు కొని రైళ్లు ఎక్కేవారు. ప్రతీ డెలివరీకి వీరికి రూ.పది వేలను ప్రశాంత్ ఇచ్చేవాడు.
అతడు చెప్పినట్లుగా వీరంతా పుణె చేరుకుని సాయిరాం, మామీ అనే వ్యక్తులకు గంజాయి పార్సిళ్లను అందించాల్సి ఉంటుంది. ఇలా ఈ నలుగురు ఏడాదిలో 20సార్లు రైళ్లలో గంజాయి తరలించారు. తరచు వీరు ఏసీ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తూ ఉండటం, ఎప్పుడూ కొత్త కొత్త ట్రాలీబ్యాగులను ఉపయోగిస్తూ ఉండడంతో వీరిపై నిఘా పెట్టి తాజాగా సరుకుతో పట్టుకున్నామని సందీప్ శాండిల్య తెలిపారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న 147 మందిని అరెస్టు చేసి 2,327 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 116 కేసులు నమోదు చేశామని వివరించారు. తాజా అరెస్టుతో ప్రధాన గంజాయి స్మగ్లర్, రిసీవర్ల సమాచారం అందిందని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలో దించామని సందీప్ శాండిల్య తెలిపారు.