Bank Mismanagement: అక్రమార్కులకు గుణపాఠం చెప్పాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:56 AM
కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలు, నిబంధనల ఉల్లంఘనలే ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను ఆర్థిక సంక్షోభంలోకి, ఈడీ కేసుల్లోకి నెట్టాయని బ్యాంక్ ఫౌండర్ ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి భంగాడియా కైలాశ్...
20 ఏళ్లుగా బ్యాంకును సర్వ నాశనం చేశారు
బ్యాంకుకు పూర్వవైభవం తెస్తాం
ఫౌండర్ ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి భంగాడియా కైలాశ్ నారాయణ్
రేపు జరగనున్న మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలు, నిబంధనల ఉల్లంఘనలే ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను ఆర్థిక సంక్షోభంలోకి, ఈడీ కేసుల్లోకి నెట్టాయని బ్యాంక్ ఫౌండర్ ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి భంగాడియా కైలాశ్ నారాయణ్ ఆరోపించారు. అందినకాడికి దోచుకుని పెద్దఎత్తున 20ఏళ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు ఈనెల 7న జరగబోయేపాలకవర్గ ఎన్నికల నేపథ్యంలో.. ఫౌండర్ ప్యానెల్ తరపు నుంచి పోటీచేస్తున్న డైరెక్టర్లు శుక్రవారం బేగంబజార్ మహేశ్వరి గార్డెన్‌లో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. చైర్మన్ అభ్యర్థి కైలాశ్ నారాయణ్ మాట్లాడుతూ.. సంస్థకు పూర్వవైభవాన్ని నెలకొల్పి, ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తమ ప్యానెల్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శకంగా పనిచేసి ఖాతాదారులకు, వాటాదారులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.
20 ఏళ్లలో అంతులేని అక్రమాలు..
2005 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న వారు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని భంగాడియా కైలాశ్ నారాయణ్ ఆరోపించారు. ‘‘పాత చైర్మన్ రమేశ్ కుమార్ బంగ్ సారథ్యంలో ఉన్న బోర్డులో ఆర్బీఐ తీవ్రమైన పరిపాలన లోపాలు గుర్తించింది. కేవైసీ నిబంధనలు పాటించనందుకు 2022లో ఆర్‌బీఐ రూ. 1.12 కోట్ల జరిమానా విధించింది. 1994 నుంచి డైరెక్టర్‌గా పనిచేస్తూ.. సంస్థాపక్ ప్యానెల్ తరపున పాలక వర్గంలో చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తి , సీనియర్ వైస్ చైర్మన్‌గా 1997 నుంచి బోర్డులో ఉన్న మరో వ్యక్తి.. వీరిద్దరూ కీలక పదవుల్లో ఉంటూ దశాబ్దాలుగా బ్యాంకుపై నియంత్రణ సాధించి దోచుకుంటున్నారు’’ అని కైలాశ్ నారాయణ్ మండిపడ్డారు. వారి హయాంలో ప్రధాన కార్యాలయ నిర్మాణం వ్యయం 2019లో రూ.32.28 కోట్లుగా ఉండగా.. 2020నాటికి రూ.44.75 కోట్లతో పూర్తి చేశారని వివరించారు. కాగా, 2023 జూలైలో ఆబిడ్స్ శాఖలో జరిగిన సైబర్ మోసంలో రూ.కోటి నిధులు మాయమయ్యాయని, ఫిక్స్‌డ్ డిపాజిట్ మోసాలతో మరో రూ.11.80 కోట్లు నష్టం జరిగిందని ఆయన వివరించారు. నిబంధనలు పాటించని కారణంగా 2023లో ఆర్‌బీఐ.. సీనియర్ వైస్ చైర్మన్ పురుషోత్తం మాండవీయను తొలగించి ప్రత్యేక అఽధికారిని నియమించిందని, తద్వారా బ్యాంక్ నెట్‌ఫండ్స్ రూ.336 కోట్ల నుంచి రూ.475 కోట్లకు పెరిగిందని కైలాశ్ నారాయణ్ చెప్పారు. కాగా, అవినీతి ఆరోపణలతో పాత చైర్మన్, సీనియర్ వైస్ చైర్మన్, ఎండీలపై ఇప్పటికీ ఈడీ విచారణ జరుగుతోందని తెలిపారు. ఆర్‌బీఐ నిబంధనల మేరకు బోర్డు సమావేశాలు జరగడం లేదని.. బోర్డు అభ్యంతరాలను పక్కనబెట్టి పాత చైర్మన్ తన కూతురును ప్రొఫెషనల్ డైరెక్టర్‌గా నియమించారని ఆరోపించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు వాటాదారుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ ప్యానెల్‌ను భారీ మెజార్టీతో గెలిపించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని కైలాశ్ నారాయణ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.