Former Minister Harish Rao: రేషన్ డీలర్లతో చెలగాటం వద్దు
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:24 AM
నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు..
బకాయి చెల్లింపుతోపాటు కమిషన్ పెంచాలి: మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పలువురు రేషన్‌డీలర్లు మంగళవారం ఆయన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. ప్రభుత్వం ద్వారా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుమాట్లాడుతూ.. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీరుస్తున్న రేషన్‌డీలర్లు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక డీలర్లు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందన్నారు. అభయ హస్తం పేరిట ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్‌డీలర్లకు 5 వేల గౌరవ వేతనంతోపాటు కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందన్నారు. మాటలు తప్ప చేతల్లేని కోతల ప్రభుత్వమిదని మండిపడ్డారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆరు నెలల కేంద్రప్రభుత్వ కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబరు నెల కమీషన్‌ను విడుదల చేయాలని, కాంగ్రెస్ హామీ ప్రకారం రూ.5 వేల గౌరవవేతనం, కమీషన్ పెంపును తక్షణం ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.