Share News

Farmers Continue to Struggle: యూరియా క్యూలైన్‌లో మాజీ మంత్రి సత్యవతి

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:37 AM

రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లారితే చాలు.. ఎరువుల కోసం సహకార సంఘాల గోదాములు, ఎరువుల దుకాణాల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్నారు..

Farmers Continue to Struggle: యూరియా క్యూలైన్‌లో మాజీ మంత్రి సత్యవతి

  • కూపన్‌ ఇచ్చినా ఒక్క బస్తాదొరకలేదన్న బీఆర్‌ఎస్‌ నేత..

  • యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లారితే చాలు.. ఎరువుల కోసం సహకార సంఘాల గోదాములు, ఎరువుల దుకాణాల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్నారు. అయినా సరిపడా యూరియా బస్తాలు దొరక్కపోతుండటంతో నిరసనలకు దిగుతున్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండా రైతువేదిక వద్ద యూరియా బస్తాల కోసం మహిళలతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా క్యూలైన్‌లో నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు క్యూలో నిల్చున్నప్పటికీ కూపన్‌ ఇచ్చారే తప్ప.. యూరియా బస్తాలు ఇవ్వలేదని ఆమె వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు యూరియా కొరతే నిదర్శనమని విమర్శించారు. యూరియా కూపన్ల కోసం వెళ్తున్న ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన గూడూరు మండలం జగన్నాయకులగూడెంలో చోటుచేసుకుంది. దుబ్బగూడెంకు చెందిన బానోత్‌ లాల్య (77), జోషి తండాకు చెందిన ధరావత్‌ వీరన్న (46) యూరియా కోసం కూపన్‌లను తీసుకునేందుకు ఒకే బైక్‌పై బొద్దుగొండ రైతువేదిక వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో జగన్నాయకులగూడెం క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే వారి బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో లాల్య అక్కడికక్కడే మరణించగా.. వీరన్నను వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గూడూరు మండలం కోబల్‌తండాకు చెందిన రైతులు నర్సంపేట-మహబూబాబాద్‌ జాతీయ రహదారిపై అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. యూరియా సరిపడా ఇవ్వడం లేదని హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ప్రగతిసింగారంలో వసంతాపూర్‌ రైతులు ఆందోళనకు దిగారు.

లారీ యూరియా పక్కదారి అని ప్రచారం

లారీ యూరియా లోడ్‌ పక్కదారి పట్టిందనే సమాచారం నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఓ ఎమ్మెల్యే గన్‌మెన్‌ 20 టన్నుల యూరియా తీసుకెళ్లారని సోషల్‌ మీడియా, న్యూస్‌ చానెళ్లలో ప్రచారం జరిగింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 రోజుల క్రితం కుక్కడం సహకార సంఘం సొసైటీకి మార్క్‌ఫెడ్‌ ద్వారా 20 టన్నుల యూరియాను కేటాయించారు. అదే సమయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్‌ నాగునాయక్‌ మార్క్‌ఫెడ్‌ అధికారికి ఫోన్‌ చేసి యూరియా కావాలని అడగ్గా.. కుక్కడం సొసైటీకి కేటాయించిన యూరియాలో 10 బస్తాలు అతనికిచ్చారు. విషయం తెలిసి సదరు గన్‌మెన్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కాగా, సొసైటీకి కేటాయించిన 20 టన్నుల యూరియా ఏఈవో సమక్షంలో రైతులకే పంపిణీ చేశామని, దుర్వినియోగం కాలేదని జిల్లా వ్యవసాయాధికారి పేర్కొన్నారు. యూరియా విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని, తన సిబ్బంది ఎవరూ యూరియాను పక్కదారి పట్టించలేదని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Sep 15 , 2025 | 04:37 AM