Share News

Minister Ramreddy Damodar Reddys Funeral: దామన్న అంత్యక్రియలు పూర్తి

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:58 AM

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో....

Minister Ramreddy Damodar Reddys Funeral: దామన్న అంత్యక్రియలు పూర్తి

  • కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు.. పాడె మోసిన పీసీసీ చీఫ్‌

  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సూర్యాపేట పట్టణం నుంచి దామన్న భౌతికకాయాన్ని తుంగతుర్తికి తరలించి ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కడసారి నివాళులర్పించారు. దామోదర్‌రెడ్డి భౌతికకాయంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఆ తర్వాత మహేశ్‌ కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం తదితరులు దామన్న పాడెను మోశారు. అనంతరం దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఏఆర్‌ పోలీసులు 10 మంది ఒక్కొక్కరు 5 రౌండ్ల చొప్పున గాల్లోకి కాల్పులు జరిపారు. దామన్న కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఆస్తులు కరిగిపోయినా క్యాడర్‌ను కాపాడుకున్నారు

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి దామన్న చేసిన సేవలు ఎనలేనివన్నారు. తన ఆస్తులు కర్పూరంలా కరిగిపోయినా కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. దామన్న ఆశయాలు ముందుకు తీసుకుపోయేందుకు తోటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి పనిచేస్తామని ఉత్తమ్‌ వివరించారు.

Updated Date - Oct 05 , 2025 | 04:58 AM