Harish Rao: మొక్కజొన్న రైతులపట్ల నిర్లక్ష్యం వీడండి
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:19 AM
మొక్కజొన్న రైతులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి.. తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు...
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న రైతులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి.. తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400తోపాటు రూ.330 బోనస్ ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఢిల్లీ టూర్లు, కమిషన్లు, సెటిల్మెంట్లు పక్కనబెట్టి రైతుల బాధలపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులను పదేపదే గుర్తు చేయాల్సిరావడం బాధాకరమని, పంటల దిగుబడి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి పూర్తి అలసత్వం వహించడం ఈ రైతుల దురదృష్టమని పేర్కొన్నారు. మరోవైపు.. బడికి వెళ్తున్న పిల్లలు విగత జీవులుగా మారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడదా? గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గురుకులాల నిర్వహణ గాలికొదిలేసి, మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.